26, మే 2009, మంగళవారం

మన ప్రజాస్వామ్యం

నేనుండేది బిజీ బిజీ రోడ్లకు, గజిబిజి బ్రతుకుల మనుషులకు, బంద్ లకు, కర్ఫ్యులకు, తెలుగు మాట్లాడని పౌరులకు ఆలవాలమైన 'హైదరాబాద్' అనబడే భాగ్యనగరంలో. ఇది వర్షం పడనంత వరకే భాగ్యనగరం. ఒక్క చినుకు పడిందో, దౌర్భాగ్యనగరంగా అవతారమెత్తుతుంది. ఇక్కడి డ్రైనేజిలకు వర్షం అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే చిన్న చినుకు చిటుక్కుమన్నా అగ్ని పర్వతం బద్దలై పొంగే లావాలా ఉప్పొంగి వాన నీటితో కలిసి రోడ్లమీద పరవళ్ళు తొక్కుతాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే భయం... ఎక్కడ ఏ మాన్-హోల్ ఉంటుందోనని?!

మొన్న సాయంత్రం ఆఫీసు నుంచి వెళ్తుంటే ఒక్కసారిగా భోరున వర్షం కురిసింది. అంతే.... ట్రాఫిక్ జామ్ అయింది... ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి. అందులో నేనెక్కిన కాబ్, పెళ్లి ఊరేగింపులోని కారులా ఆగుతూ ఆగుతూ వెళ్ళాలా వద్దా అన్నట్లు నడుస్తుంది... అటుపడి, ఇటుపడి ఇల్లు చేరే సరికి తల ప్రాణం తోకలోకి వచ్చినంత పని అయ్యింది (అలాగని నాకు తోక ఉందనుకోనక్కర్లేదు... ఏదో మాట వరసకి అన్నాను. అంతే!).

ఇక నిన్నటి విషయానికొస్తే... వర్షం పడకుండానే ట్రాఫిక్ జామ్ అయింది! అదేంట్రా అనుకుంటున్నారా? తొందరెందుకు... చెబుతాను... ఆగండి. పంజాగుట్ట సెంట్రల్ నుండి ఖైరతాబాద్ సెంటర్ కి వెళ్ళేసరికి అక్షరాలా గంటసేపు పట్టింది. తీరా అక్కడికెళ్ళాక తెలిసింది... ఆ రోజు మన అమాత్యుల వారలు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారని.. "ప్రజా సేవకులు ప్రమాణస్వీకారం చేస్తుంటే ప్రజలు ఇబ్బంది పడుటయా?" అనిపించింది. నా పక్కనున్నాయన కోపంతో "వీళ్ళను గెల్పిచ్చినందుకు మనన్ని మనం చెప్పుతోటి కొట్టుకోవాలే" అన్నాడు. అందరూ ఒక్కసారి నవ్వారు. అందులోనూ నిజం లేకపోలేదు. కొంచం లోతుగా ఆలోచిస్తే ఆశ్చర్యం గొలిపే ప్రశ్నలు మనకే కలుగుతాయి.
అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఇప్పటి కాలాన్నీ, పరిస్థితుల్ని బట్టి ఇలా చెప్పవచ్చుననుకుంట.
ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మూడేళ్ళకో, ఐదేళ్ళకో స్వాములని ఎననుకుంతారన్నమాట. తర్వాతేమో ఈ స్వాములు పల్లకిలో కూర్చొని హుక్కా పీలుస్తుంటారు. మనము అనగా ఇండియాన్స్... దటీజ్ భారతీయుల్స్ ఆ పల్లకిలను మోస్తుంటామన్నమాట. దానికి ఏలిన వారు మనకిచ్చే కూలి ఏమిటంటే పన్నులు మరియు ఉపన్యాసంబులు.
వాళ్ళలో వాళ్ళకేవో అభిప్రాయ భేదాలు, కుమ్ములాటలు వస్తుంటాయి. హఠాత్తుగా డిల్లీకి రమ్మని పిలుపు వస్తుంది. హుటాహుటిన ముఠా నాయకుడు పొద్దున హైదరాబాద్ నుండి డిల్లీకి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తాడు. మనకేమో ఆఫీసు పని అయ్యాక ఇంటికి వెళ్ళాలంటే బస్సు దొరకదు. వాళ్ళు వెళ్తున్నారంటే చాలు విమానం సర్వీసులు మొత్తం ఆ ఏలికలకే! వీటికి డబ్బిచ్చే గొర్రెలం మనమే!

ఇలాంటివి చిన్న విషయాలుగానే అనిపించవచ్చు. ఈ చిన్న చిన్న విషయాలను ప్రతిఘటించడం నేర్చుకొన్ననాడు - పల్లకీలు తల్లక్రిందులవుతాయి. ప్రజాస్వామ్యం నిటారుగా నింగిని తాకుతూ నిలబడుతుంది.
అందరం ఆ దిశలో సాగుదామని ఆశిద్దాం! సాగుదాం!

17, మే 2009, ఆదివారం

చేదు నిజం

'మన అనుబంధాలన్నీ ఆప్యాయతానురాగాల పునాదులపై నిర్మించిన భవంతులు....'
అన్న నా అందమైన నమ్మకం రోజురోజుకీ అడుగంటిపోతుంటే...

'మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే' అన్న వాదనతొ ఏకీభవించని నాకు
దానిని నిరూపించడానికి అధారాలు కరవైపొతుంటే...

అయినవారి మధ్య అనుబంధాలకి లెక్కలు కట్టలేని నా అఙ్ఞాన హృదయం
అనుబంధాలకి అతీతంగా డబ్బుతో సంతొషాన్ని కొనుక్కోవాలనుకునే
మేథావుల విఙ్ఞానం ముందు నిలవలేక తల్లడిల్లిపోతుంటే...

మనుషుల్లో మంచీ చెడు పసిగట్టలేకపోయిన నా స్వఛ్ఛమైన బాల్యం...
విభిన్న మనస్తత్వాలని విశ్లేషించలేకపోయిన నా బాల్యం...
అందరూ మంచివాళ్ళే... లోకమంతా అందమైనదే... అని
అమాయకంగా నమ్మిన నా బాల్యం ఒక్కసారిగా మదిలో మెదిలి...
ఆ భావాలన్నీ ఒక్కొక్కటిగా నా కన్నీటిలో కరిగి కనుమరుగైపోతుంటే...

కఠోరమైన వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే...
ఇది నిజమని నా మనసుని నమ్మించలేక...
అబద్దమని నిరూపించలేక...దీన్నుండి తప్పించుకుపోలేక...

ఈ విషయాలని తనలో ఎప్పుడు కలుపుకుంటుందా...
అనిఆశగా కాలం వైపు చూస్తూ నేను...

జీవితపు లోతుల్ని తరచిచూడమంటూ...
మానవ సంబంధాల మాయాజాలంలో మనసుని బలి పశువుని కానీకు...
అని హెచ్చరిస్తూ... భారంగా కదులుతున్న కాలం...

7, మే 2009, గురువారం

నట్టింట అంటువ్యాధి

మొన్న రాత్రి ఒక స్నేహితురాలితో ఫోనులో మాట్లాడుతుండగా మధ్యలో 'టీవీ ఉందా? ఉంటే జీ తెలుగు ట్యూన్ చేసుకో' అంది. సరే చెప్పింది కదా, ఇంటరెస్టింగ్ ప్రోగ్రాం ఏదో వస్తున్నట్టుంది అని ట్యూన్ చేసి టీవీ ముందు కూర్చున్నాను. తీరా చూస్తే అది డాన్స్ పోటీల కార్యక్రమం. ఈ రోజుల్లో దృశ్య శ్రవణ యంత్రాల్లో (అదేనండి... టీవీలో) చవకబారు కార్యక్రమాలు ప్రదర్శితముతున్నాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం. అరవిరిసిన కుసుమాల్లాంటి పసి పిల్లలతో అసభ్యకరమైన ఐటం సాంగ్స్, క్లబ్ డాన్సుల్లాంటివి చేయిస్తున్నారు. అదే దౌర్భాగ్యమంటే, అంతటితో ఆగక ప్రేక్షక మహాశయులు 'ఆహా... ఆ పాప ఎంత బాగా చేసిందో!' అని మెచ్చుకుంటున్నారు. డబ్బు దండుకోవడమే పరమావధిగా సృష్టించిన ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలలో ఒకరు వృద్ధులు. ఆ మహానుభావుడికైనా ఇది తప్పని ఏ కోశానా అనిపించలేదా అని బాధేసింది. ఇక మిగిలిన ముగ్గురు ఆడ న్యాయనిర్ణేతల సంగతి సరే సరి. 'మనం ఎక్కడున్నాం? ఎం చేస్తున్నాం?' అన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా 'రియాల్టీ షో' పేరుతో, జడ్జిమెంట్ ఇచ్చే నెపంతో వారు చేసే చవకబారు ప్రవర్తన చూస్తే కాస్త స్పృహ ఉన్నవారెవరికైనా అసహ్యం వేయక మానదు. నేటి సమాజం ఇలా తయారవ్వడానికి మూల కారణం ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించడమే. ముందు ప్రజలే ఇలాంటివి చూడకుండా, తమ పిల్లల్ని చూడనివ్వకుండా ఉండాలి. కనీసం అప్పుడైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ తీయకుండా ఉంటారు. ఇలా చెపితే 'మా ఇష్టం' అంటారు.
చిన్న పిల్లల నుండి సినిమా తారల దాక, రచయితల నుండి రాజకీయ నాయకుల దాక - బహిరంగంగా కాకపోయినా విడిగా మాట్లదినప్పుడైనా పలికే వాక్యం - 'నా ఇష్టం'. తానూ చెప్పినదో, చేసిందో తనకే పూర్తిగా సబబు కాదు అనిపించినప్పుడో, అవతలి వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని దేబ్బతీస్తున్నారు అనిపించినప్పుడో చాలా మంది ప్రయోగించే బ్రహ్మాస్త్రం 'నా ఇష్టం'. ఈ మూడక్షరాల మాట వెనుక 'నేనొక వ్యక్తిని, నాకొక మనసుంది, దానికి స్వేచ్ఛ ఉంది' అన్న భావం దాగి ఉంది.
ఇష్టం అయితే కష్టం లేదు కానీ దీనితో తామూ పాడవ్వడమే కాకుండా సమాజానికీ కూడా భ్రష్టుపట్టిస్తున్నారు. 'ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తావు. పక్కవాడ్ని వేలెత్తి చూపడం తప్ప ఇంకేమి లేదు' అని నన్నందరూ అంటుంటారు. సమాజంలో దిగజారుతున్న విలువలని చూసి బాధతో నా ఆవేదనను వ్యక్తం చేయడం, సరిదిద్దాలనే ప్రయత్నం చేయడం తప్ప ఎవరినీ నొప్పించాలని కాదు.

నేటి సమాజాన్ని గురించిన ఒక వ్యాసంలో ఒక రచయిత ఇలా అన్నారు - '' నేటి సమాజంలోని వ్యక్తులు, ఫ్యాక్టరీలలో ఒక 'అచ్చు' నుండి యాంత్రికంగా వరసగా వచ్చే ఒకే మాదిరి వస్తు భాగాల్లాంటివారు. వారు ఆసుపత్రులలో పుడతారు. హోటళ్ళలో తింటారు. ఆసుపత్రులలోనో, రోడ్లమీదనో మరణిస్తారు" అని చెప్పుకోవచ్చు.
వారి అభిప్రాయాల్ని తీర్చిదిద్దేది టి.వి. ప్రకటనలూ, సినిమా తారలూ!
పత్రికలలో ప్రకటనలు కేవలం చదువుకున్న వారినే ఆహారంగా గైకొంటాయి. శబ్దాల ప్రకటనలు చెవులున్న వారందరినీ మెలిపెడతాయి. కాని, ఈ టి.వి. ప్రకటనలు సర్వభాక్షకాలు (అందరిని సమూలంగా నాశనం చేస్తాయి). టి.వి. అనేది మనం ఇంట్లో తెచ్చుకొని ప్రతిష్టించుకునే అనారోగ్యం.
పరిశోధనల్లో వెల్లడైన దారుణమైన నిజం ఏమిటంటే టి.వి. చూసే వాళ్ళలో ముఖ్యంగా పిల్లల్లో మెటబోలిక్ రేట్ గంటకు 200 కాలరీలు తగ్గి, వారి మనస్సు hypnotism కి గురైన వారిలాగా ఉంటుందంట.
ఈ మధ్య కాలంలో టి.వి.లో వచ్చే పచ్చి అబద్దాల ప్రకటనలు ఇలా ఉన్నాయి.
- మీరు ఫలానా టూత్ పేస్టు వాడితే మీ చుట్టూ అమ్మాయిలు తిరుగుతారు. అలా కాకుండా మామూలు పళ్ళ పొడి వాడితే మీ పళ్ళు పుచ్చి పోతాయి.
- దాహం వేస్తే మంచి నీళ్ళు కాదు, కొబ్బరి బొండం కాదు, పళ్ళ రసం కాదు మా బ్రాండు రంగు నీళ్ళనే తాగండి. (దీనికోసం కోట్లు ఖర్చు చేసి ప్రకటనలను చిత్రించడం, దానిలో సినీతారలు, క్రికెట్ ఆటగాళ్ళు నటించడం గమనార్హం)
- ఆకలి వేస్తె అరటి పండ్లు వద్దు, పెరుగన్నం వద్దు, రెండు నిమిషాల్లో తయారయ్యే ఫలానా (అపాయకరమైన రసాయనాలు ఉన్న) వస్తువునే తినండి.
- శక్తి కావాలంటే పాలు ఎందుకండి... అందులో మా పౌడర్ కలిపి తాగండి. కొండల్ని పిండి చేసే బలం వస్తుంది.
ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పే ప్రకటనలను hypnotic స్థితిలో ఉన్న పిల్లల మెదళ్ళకు పంపుతున్నాం, మనం చూస్తున్నాం. గోర్రెల్లగా తలలూపుతున్నాము. దీని అర్ధం ఏంటి? పిల్లలు ఏమైపోయినా ఫర్వాలేదనా? లేకపోతే ఇంకేదైననా?
ఈ భయంకర పరిణామాన్ని గురించి వాకాటి పాండురంగారావు గారు 1991 లోనే హెచ్చరించారు.
మరి ఇంత జరుగుతున్నా సమాజ ప్రగతికి కంకణం కట్టుకున్న సర్కారు వారు ఎందుకు ఊరుకున్నారో? వీరికి వేల కోట్ల ఆదాయం ముఖ్యమా? లేక ప్రజల జీవితాలు, సమాజ శ్రేయస్సా?
ఏలిన వారి సంగతి అటుంచండి, కనీసం ఇప్పటికైనా మనలో పరివర్తన రాకుంటే ఇప్పటికే మర బొమ్మల్లా తయారవుతున్న పిల్లలు ఇంకా దౌర్భాల్య స్థితికి చేరడం ఖాయం!

24, ఏప్రిల్ 2009, శుక్రవారం

జ్ఞాపకాలు


చిన్నప్పుడు నిద్దట్లో
అమ్మ కప్పిన పైట కొంగు వెచ్చదనం
ఒక జ్ఞాపకమై
నా భుజాల చుట్టూ
శాలువాగా చుట్టుకుంటుంది
మూర్తీభవించిన యక్షిణి లా
ఆమె ఎక్కడో వుంటుంది
నేను మాత్రం
తియ్యటి పలకరింపుల మాధుర్యాన్ని
జ్ఞాపకాల బైనాక్యులర్స్ లోంచి చూస్తుంటాను
గుండె గాలి పటమై
చెట్టూ కొమ్మల్లో రప రప మంటున్నప్పుడు
బ్రతుకు భుజమ్మీద
పసి పాప నై జారిపోతున్నప్పుడు
ఒక పిల్ల తెమ్మెరలా
అమ్మ నన్ను వీపు నిమురుతుంది
అప్పుడు పాల బువ్వలు తినిపించిన
అరిటాకు చేతులు
సుఖ దు:ఖాల గోడలను కట్టీ కట్టీ
రాటు దేలిన ఆకు రాళ్ళవుతున్నాయి
అప్పుడప్పుడూ
గుండె గుభిల్లున జారి
ఇంటి పెరట్లో బాదం కాయలా రాలి పడుతుంది
ప్రేమ పలకరింపులు
పురాతన అవశేషాలై
తుప్పు పట్టి చూరు కింద పడుంటాయి
గాట్లు పడిన హృదయానికి
మాసికలు వేసీ వేసీ విసిగి పోతున్నప్పుడు
ఒక అస్పష్ట భావమేదో
నన్ను నిలువెల్లా తూర్పార బడుతుంది
ఇప్పుడు నేను
సమూహం లో ఏకాకినై
శూన్యపు రెక్కల కింద
పిల్ల కాకినై ఒదిగి పోతుంటాను
ఒక్క అమ్మ మాత్రమే
నన్ను మనిషిని చేసి
జీవిత రహ దారిని చూపుతుంది
నేను తప్పటడుగు లేస్తూ
అమ్మ చిటికిన వేలు పట్టుకుని
జీవన రేఖల సరిహద్దులు
కొలత వేస్తుంటాను.

( 'నీలి మేఘాలు' కవితా సంకలనం నుంచి )