24, ఏప్రిల్ 2009, శుక్రవారం

జ్ఞాపకాలు


చిన్నప్పుడు నిద్దట్లో
అమ్మ కప్పిన పైట కొంగు వెచ్చదనం
ఒక జ్ఞాపకమై
నా భుజాల చుట్టూ
శాలువాగా చుట్టుకుంటుంది
మూర్తీభవించిన యక్షిణి లా
ఆమె ఎక్కడో వుంటుంది
నేను మాత్రం
తియ్యటి పలకరింపుల మాధుర్యాన్ని
జ్ఞాపకాల బైనాక్యులర్స్ లోంచి చూస్తుంటాను
గుండె గాలి పటమై
చెట్టూ కొమ్మల్లో రప రప మంటున్నప్పుడు
బ్రతుకు భుజమ్మీద
పసి పాప నై జారిపోతున్నప్పుడు
ఒక పిల్ల తెమ్మెరలా
అమ్మ నన్ను వీపు నిమురుతుంది
అప్పుడు పాల బువ్వలు తినిపించిన
అరిటాకు చేతులు
సుఖ దు:ఖాల గోడలను కట్టీ కట్టీ
రాటు దేలిన ఆకు రాళ్ళవుతున్నాయి
అప్పుడప్పుడూ
గుండె గుభిల్లున జారి
ఇంటి పెరట్లో బాదం కాయలా రాలి పడుతుంది
ప్రేమ పలకరింపులు
పురాతన అవశేషాలై
తుప్పు పట్టి చూరు కింద పడుంటాయి
గాట్లు పడిన హృదయానికి
మాసికలు వేసీ వేసీ విసిగి పోతున్నప్పుడు
ఒక అస్పష్ట భావమేదో
నన్ను నిలువెల్లా తూర్పార బడుతుంది
ఇప్పుడు నేను
సమూహం లో ఏకాకినై
శూన్యపు రెక్కల కింద
పిల్ల కాకినై ఒదిగి పోతుంటాను
ఒక్క అమ్మ మాత్రమే
నన్ను మనిషిని చేసి
జీవిత రహ దారిని చూపుతుంది
నేను తప్పటడుగు లేస్తూ
అమ్మ చిటికిన వేలు పట్టుకుని
జీవన రేఖల సరిహద్దులు
కొలత వేస్తుంటాను.

( 'నీలి మేఘాలు' కవితా సంకలనం నుంచి )