28, డిసెంబర్ 2010, మంగళవారం

త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు


ప్రఖ్యాత వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజ స్వామి వారికి భక్తిపూర్వకంగా అర్పించే నివాళి త్యాగరాజ ఆరాధనోత్సవం. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు వారి జయంతిని పురస్కరించుకొని వారి సమాధి దగ్గర ఈ ఉత్సవం నిర్వహిస్తారు. 5 రోజులు జరిగే ఉత్సవాలు ప్రపంచమంతటా జరుపుకున్నప్పటికీ తమిళనాడులోని తిరువాయూరులో జరిగే ఆరాధనోత్సవం ముఖ్యమైనది. 2011వ సంవత్సరంలో ఆరాధనోత్సవాలు జనవరి 24న ప్రారంభం కానున్నాయి.
ఈ ఆరాధనోత్సవంలో వేల మంది కర్ణాటక సంగీత విద్వాంసులు పంచరత్న కృతులను గానం చేసి త్యాగయ్యకు   నివాళులర్పిస్తారు.
          శ్రీ త్యాగరాజ స్వామి వారు తెలుగు, తమిళ, సంస్కృత భాషల్లో కొన్ని వేల కృతులను, కీర్తనలను రచించారు. వీరు 1767లో తంజావూరు జిల్లాలోని తిరువాయూరులో జన్మించారు.
ఈ ఆరాధనోత్సవాలు విజయవాడలో జరుగుతుంటాయని విన్నాను. హైదరాబాదులో అసలు జరుగుతాయో, జరిగితే ఎక్కడ జరుగుతాయో తెలియలేదు.
ఇంకో విషయం... ఎప్పటినుంచో పెద్ద త్యాగరాజ స్వామి ఫోటో ప్రింట్ చేయించాలని కోరిక. కానీ high resolution ఫోటోలు దొరకట్లేదు. ఎవరి దగ్గరైన ఉంటే కాస్త పంపించారూ..!

5, నవంబర్ 2010, శుక్రవారం

ఏడవ వ్యసనంలోకంలో వ్యసనాలు ఏడు రాకాలుగా ఉంటాయనీ, వాటినే సప్త వ్యసనాలంటారనీ శాస్త్రం చెప్తోంది. వాటిలో ఏడవ వ్యసనం అర్థ సందూషణం.
అర్థ - తాతలూ, తండ్రులూ ఆర్జించిన ద్రవ్యాన్ని, సందూషణం - ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టడం
ఈ వ్యసనానికి ఉదాహరణ దుర్యోధనుడు. లోకంలో ఎవరూ కూడా తాము సంపాదించిన డబ్బుని అంత తేలికగా ఖర్చు పెట్టలేరు. అప్పనంగా వచ్చిన సొమ్ముని మాత్రం వేగంగానూ, తేలికగానూ ఖర్చు పెట్టడానికి వెనకాడరు. దీనికి కారణం సంపాదించడంలో ఉండే కష్టమేమిటో తెలియకపోవడమే! ఏనాడో శంతనుడనే మహానుభావుడు తన పుత్రుడైన భీష్మునికి రాజ్యాన్ని అందజేస్తే, ఆ భీష్ముడు కౌరవ పాండవులకి చేరిసగంగా రాజ్యాన్ని పంచితే అదికాస్తా అస్తవ్యస్తమై పాండవుల రాజ్యాన్ని అపహరించడం కోసం దుర్యోధనుడు అనేకమైన దుష్ట ఉపాయాలని పన్నడానికి కారణమై కూర్చుంది. జూదం ఆడటం కోసం ఓ మహాభవనం, పాండవులు పడుతున్న అష్టకష్టాలని చూసి ఆనందించడం కోసం పెద్ద సైన్యంతో ఎంతో వ్యయంతో అరణ్యాలకి వెళ్ళడం, కృష్ణుడు రాయబారానికి వస్తుంటే పెద్ద మొత్తంలో వ్యయం చేసి ఎక్కడికక్కడ విడిది భావనల్ని కట్టించడం, రాజ్యాన్ని అపహరించడం కోసమే పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని (ఇరవైరెండు లక్షలమంది) నిరంతరం పోషించడం... ఇలా లెక్క లేకుండా ఖర్చు చేసాడు దుర్యోధనుడు. చివరికి ఊరు పేరు లేకుండా తొడలు విరిగి యుద్ధరంగంలో దురదృష్టకరమైన చావుని సానుభూతి లేని మరణాన్ని పొందాడు. ఈ సొమ్మునే హస్తినాపురం మీద వ్యయం చేసి ఉండి ఉంటే ఎంతో అద్భుతంగా ఆ నగరం తీర్చిదిద్దబడి ఉండేది. కాబట్టి వ్యర్థంగా ఖర్చు చేయడమనేది కూడా ఓ వ్యసనమే! అయితే దానిలో ఉండే ఇబ్బందిని వ్యసనపరుడు ఎదుర్కోడు. ఆ కష్టాన్ని తరువాతి వారు అనుభవించాల్సివస్తుంది.

16, సెప్టెంబర్ 2010, గురువారం

స్వరరాగ గంగా ప్రవాహం

కౌసల్యా సుప్రజా రామా... అని ఆ గళం నుండి సుప్రభాతం వినకపోతే కలియుగ దైవం వెంకటేశ్వరుడికే తెల్లవారదు. ఆమె పాటలు వింటుంటే మనసు తేలికవుతుంది. తెలియకుండానే భక్తి భావం కలుగుతుంది. ఆ దివ్యమంగళ రూపం చూస్తే చాలు రెండు చేతులూ ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది.
ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంట! 
అవును... 'MS అమ్మా' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే మదురై షణ్ముఖవడిపు సుబ్బలక్ష్మి. ఈ రోజు MS సుబ్బలక్ష్మి గారి 94వ జయంతి. 
 1916 సెప్టెంబర్ 16న తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో సుబ్రహ్మణ్య అయ్యర్, షణ్ముఖవడిపు అమ్మల్ దంపతులకు ఆమె జన్మించారు. చిన్నపటినుంచే సంగీతమంటే ఆసక్తి ఉండడంతో దానిలో శిక్షణ పొంది 1933 లో మద్రాస్ సంగీత అకాడమీలో మొదటి సంగీత కచేరి ఇచ్చారు. అలా మొదలైన ఆమె సంగీత ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఐరాసలో పాడినా, బ్రిటన్ రాణిని తన గాన మాధుర్యంతో తన్మయురాలిని చేసినా అది ఆవిడకే చెల్లింది. అంతేకాదు... దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, భారతరత్న, ఇందిరా జాతీయ సమైక్యతా అవార్డు, ఢిల్లీ ప్రభుత్వంచే జీవిత సాఫల్య పురస్కారం, రామన్‌ మెగసెసే పురస్కారం, పలు విశ్వవిద్యాలయాలచే డాక్టరేట్‌లు ఆమెను వరించాయి. 
ఇలా కొన్ని దశాబ్దాలపాటు ఈ ధరణీతలాన్ని భక్తి భావనను, పవిత్ర సుమగంధాలను వెదజల్లి పులకింపజేసిన కర్నాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 డిసెంబర్ 11న ఆగిపోయింది.
భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఆమె గళం ఈ ఇలాతలంపై వినపడుతున్నంతకాలం ఆ స్వరరాగ గంగా ప్రవాహం సాగుతూనే ఉంటుంది...

24, ఆగస్టు 2010, మంగళవారం

తెలుగువారందరం... తెలుగు కోసం నడుద్దాం!


ఫ్లాష్... ఫ్లాష్... ఇప్పుడే buzz ద్వారా అందిన వార్త...
బయటి ప్రపంచంలో తెలుగు వాడకం పెరగాలనే నినాదంతో తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని 29 ఆగస్టు 2010 న e-తెలుగు వారు 'తెలుగు బాట' అనే కార్యక్రమం చేపట్టనున్నారట!
ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుండి పీవీ జన్మ భూమి వరకు నడవనున్నారు.
చాలా మంచి ప్రయత్నం కదూ... నేను వెళ్తున్నాను. మరి మీరు?

1, ఆగస్టు 2010, ఆదివారం

ఒకప్పుడు...
"పొద్దంతా కలిసే ఉంటున్నాం. ఇష్టం ఉంటే క్లాసు లో ఉంటాం. బోర్ కొడితే కాంటీన్ కి వెళ్లి కూర్చుంటాం. సాయంత్రం ఇళ్ళకు వెళ్ళాక కూడా SMS లూ ఫోన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. మళ్లీ ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఒక రోజు ఎందుకు? ఇది స్నేహాన్ని ఒక రోజుకి confine చేయడం కాదా?" - అనిపించేది.

చూస్తుండగానే కాలేజీ అయిపోయింది. జీవన సంగ్రామంలోకి అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 
Tables - cubicles గా, Letters - emails గా, Canteen - Cafe గా, Assignments - Tasks గా మారిపోయాయి. అసలు లైఫ్ స్టైలే మారిపోయింది. అల్లరిగా ఒక్క నిమిషం కూడా నోటికి బ్రేక్ వేయకుండా మాట్లాడే వాళ్ళం ఇప్పుడు dignified గా ఉంటూ మితంగా మాట్లాడుతున్నాం. తెలియకుండానే ఆఫీసు పనుల్లో బిజీ అయిపోయాము. ప్రతీ విషయానికీ వంద సార్లు ఆలోచించాలి. చివరికి సినిమాకి వెళ్ళాలన్నా కూడా!
Busy అన్న పదాన్ని ''ఏ రా బిజీనా?" అంటూ వెటకారానికి వాడేవాళ్ళం :) . ఇప్పుడు అదే buzz word అయిపొయింది. ఎవరన్న ఎమన్నా అడిగితే 'Busy boss... We can plan that during weekend' అంటున్నాం. తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తుంటుంది. :)

"కాలేజీ రోజులు ఎంత బాగుండేవి. హాయిగా... మన ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు" అనిపిస్తుంది ఒక్కోసారి.
కానీ మారిపోయిన జీవన విధానం అభిప్రాయాలను కూడా మార్చేసింది.


ఇప్పుడు...
"Friendship Day పుణ్యమా అని కనీసం ఏడాదికి ఒకసారైనా మిత్రులతో మాట్లాడగలుగుతున్నాం. మిగిలిన రోజుల్లో గజిబిజిగా సాగే గందరగోళపు బ్రతుకులనుంచి బయటికి వచ్చి పాత నేస్తాలను కలిసి, కనీసం ఫోనులోనైనా మాట్లాడి కుశల సమాచారాలను తెలుసుకోవచ్చు. గత స్మృతులను తలచుకుంటే కలిగే సంతోషం అనిర్వచనీయం" - అనిపిస్తుంది. :)
 'మనుషులు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు' అన్న మాట ఎంత నిజమో అనుభవపూర్వకంగా అర్ధమైంది.
Instant Messengers, Social Networking Websites ఎన్ని ఉన్నా ఏదో కోల్పోయాము అన్న భావన మనసును తోలిచేస్తుంది.
కొత్త నేస్తాల పరిచయం ఈ బాధను కొంచం తగ్గిస్తుంది.

"Friendship is born at that moment when one person says to another, 'What! You too? I thought I was the only one." అన్నారు british novelist C.S. Lewis.
అవును మరి... 'బీడీలు తాగేవాడికి  బీడీలు తాగేవాడు ఫ్రెండ్ అవుతాడు. సిగరెట్లు తాగేవాడికి సిగరెట్లు తాగేవాడు ఫ్రెండ్ అవుతాడు! ;)
ఎక్కడో ఓ సారుప్యత  లేనిదే స్నేహం కుదరదని నా అభిప్రాయం.
నాకు ఈ సంవత్సరం కొందరు ఆసక్తికరమైన, అద్భుతమైన (నాకు సంబంధించినంతవరకు) వ్యక్తులతో పరిచయం ఏర్పడి పైన చెప్పిన formula ప్రకారం స్నేహం గా మారింది (మేం బీడీ, సిగరెట్ల batch కాదు. మళ్లీ అడక్కండి). 
నన్ను ఓదార్చడానికే వచ్చారా అన్నటు అనిపించింది.
ఈ స్నేహం చిరకాలం నిలవాలని, పాత మిత్రులను మళ్లీ ఒక్కసారైనా కలవాలని ఆకాంక్షిస్తూ...
HAPPY FRIENDSHIP DAY!

22, ఏప్రిల్ 2010, గురువారం

పెళ్ళంటే?

 పెళ్లి అంటే ఏంటి?
ఎక్కడో చదివినట్టు గుర్తు... "పెళ్ళంటే జీవితపు బాట మీద కొన్ని దశాబ్దాల పాటు ఒకరికొకరు బాసటగా నడవడానికి ఒక యువతీ, యువకుడూ ఒప్పందం కుదుర్చుకునే సుముహుర్తం".
కానీ, నేటి పెళ్ళిళ్ళని ఇలా నిర్వచించవచ్చుననుకుంటా -

ఆత్మాభిమానం అనేది లేకుండా దొరికినంత ఎక్కువ మొత్తానికి తమ పుత్ర రత్నాలను 'అమ్మి' లాభాలను లేక్కలేసుకునే తల్లిదండ్రుల Stock Exchange.
తతంగాలను చకచకా ఆకాశంలోని పతంగాలలా చంచలంగా అవ్వగోట్టేసి వీలయినంత ఎక్కువ ధన, ధన్య రాసులను పోగేసుకొని పరుగెత్తి ఇంకో 'engage'ment ని అందుకోవలనుకునే పురోహితుల పరుగులో ఒక చిన్న bus stop.
ధగధగా మెరిసే రంగు కాగితాల పెట్టెలో అందంగా అలంకరించి తెచ్చిన కానుకలను అందించి, చేతి బరువు దించి, భోజనం ముగించి వెళ్ళిపోవాలనుకునే అతిధుల junction.
కష్టపడి కూడబెట్టిన లక్షలాది రూపాయలు క్షణాలమీద హారతి కర్పూరంలా ఆవిరైపోతుంటే, తమకే తెలియని తతంగాల, అర్ధంకాని హడావిడుల, అర్ధంలేని సంప్రదాయాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండవలసినాన్ని చోట్ల తాముండలేక, తాము పిలిచినా వాళ్ళని తామే పలకరించలేక పోయామే అని మధనపడే వధువు తల్లిదండ్రుల ఆవేదనల కేంద్రం.

ఒకప్పుడు పల్లెల్లో, ఆనాటి జీవన విధానానికి అనుగుణంగా, తాపిగా అందరు కలసి అయిదారు రోజులు కులాసాగా మాటలడుకుంటూ, పాటలు పాడుకుంటూ, విందులారగిస్తూ గడిపే ఒక అద్భుతమైన experience, మన సాంప్రదాయబద్ధమైన వివాహం.
ఎదుర్కోలు, తలంబ్రాలు, భోజనాల దగ్గర పరిహసాల్లాంటివి మనం ఇప్పటికీ ఆనందిస్తుంటాము. నమ్మే వాళ్ళకు, ఆస్వాదించే వాళ్ళకు మంత్రాలూ, హోమం, ఆశీర్వచనాలు అపురూపమైన అనుభవాలే.
కానీ నగరాలలో నేడు జరిగే వివాహాల పరిస్థితి ఏంటి?
పెళ్లి ఏర్పాట్లకూ, NASA rocket launching process కూ చాలా పోలికలున్నట్టు కనిపిస్తుంది. కావాలంటే మీరూ చుడండి...
కొన్ని నెలల ముందు నుంచే ఏర్పాట్ల గురించి చాలా detailed గా ఆలోచించాలి. Perfect expectations ఉండాలి. Function hall ఎన్నుకోవాలి. ఆహ్వానాలు print చేయించాలి. భోజనాల menu నిర్ణయించాలి. వెయ్యి cards పంచితే ఎంతమంది వస్తారు అన్నది శ్రీనివాస రామానుజన్ కూడా తేల్చలేని problem!
తీరా ఆ రోజు వచ్చేస్తుంది...
NASA 'Count Down' లొ rocket, launching pad నుండి విడిపోయేది ఒక మహత్తరమైన క్షణం!
ఇక్కడ వధువు మెడలో మంగళసూత్రం పడే క్షణం అంతే ముఖ్యమైనది.
Rocket ఎగిరాక ground control crew అది వెళ్ళే దారిని గమనిన్చినట్టే ఇక్కడ వచ్చిన వారిని పలకరించడం, వారి భోజనాలు, అవీ చూడడం, కానుకల లిస్టులు రాయడం లాంటివి ఉంటాయి.
ఇక వచ్చిన వారంతా భోంచేసి వెళ్లిపోయాక గాని పెళ్ళికూతురు తల్లిదండ్రులకు గాబరా తీరదు. ఆ వచ్చిన అతిధులేమో తము తెచ్చిన కానుకలు అందించి, అక్షింతలు చల్లి, ఆతిధ్యం అందుకుని ఆటోలు, కార్లూ ఎక్కి ఇంటికి వెళ్ళడంలో బిజీగా ఉంటారు.
అంటే వారికి, వీరికి కూడా అసలు ఉద్దేశించబడిన తీరిక, ఆప్యాయత, సరదాగా గడుపుదాం అనే ఆలోచనలు లేవు. వీరు కేవలం ఒక లంఛనాన్ని శాస్త్రం కోసం (వాళ్ళకోసం కాదు) పాటించడం జరుగుతుంది.
దీనికయ్యే ఖర్చెంత? సగం కూడా తినకుండా విస్తర్లతో పాటు విసిరేసిన ఆహార పదార్ధాల విలువెంత? బయటా చెత్త కుండీల దగ్గర కుక్కలతో పోటీపడి మరీ ఈ ఎంగిల్లను తినే నిర్భాగ్యులున్న ఈ దేశంలో ఇలాంటి విందులు, వృధా చేయడాలు ఎంత వరకు సమంజసం?
పెళ్ళంటే డబ్బులు వెదజల్లే, రకరకాల నగలు, చీరలు కొలువుదీరే ఎగ్జిబిషనా?
ఇలా కాకుండా, పెళ్లి లోని అర్ధవంతమైన భాగాన్ని ప్రశాంతంగా ముఖ్య బంధువులు ఒక 30 - 40  మందితో జరుపుకొని తరువాత విందు లాంటిదేదైనా ఇస్తే చాలదా?
 ఈ మధ్య కొన్ని పెళ్లిళ్లకు హాజరై అక్కడ జరిగే తంతును చూసి అసంతృప్తి చెందాను. ఇది ఇలాగే కొనసాగితే మన వివాహ పద్ధతిలోని అర్ధవంతమైన, అందమైన భాగాలూ కనుమరుగాయి వాటి పట్ల మనకే చిరాకు కలుగుతుందేమో అనిపించింది. వరుడు చిత్రంలోని తెలుగు వారి పెళ్లిని చూసాక పెళ్లి లోని అర్ధవంతమైన భాగమేంటో తెలుసుకోవాలనిపించింది. చదివి తెలుసుకున్నాక నాకు కలిగిన అనుభూతుల సారాంశమే ఈ బ్లాగ్ పోస్ట్.

11, ఏప్రిల్ 2010, ఆదివారం

వివాహ భోజనంబుఒక వ్యక్తి సంస్కారం ఎట్లాంటిది అని తెలుసుకోవడానికి ఒక సులువైన చిట్కా ఉంది.
అతగాడిని ఏదయినా 'బఫే' డిన్నరు దగ్గర గమనించండి, చాలు!
విందు భోజనానికి పచ్చ జండా ఊపిన మరుక్షణం ఎగిరి గంతేసి, పలుపుతాడు విప్పగానే తల్లి దగ్గరకు ఉరుకులెత్తే లేగదూడలా భోజనాల మెజావైపు 'పదండి ముందుకు పదండి తోసుకు' అని పరుగు లెడతాడా?
లేక
అంతకుముందు ఎవరితోనైనా మాట్లాడుతున్నట్లయితే అలాగే మాట్లాడుతూ నెమ్మదిగా లేచి భోజనం వైపు నడుస్తాడ?
లేక
'పదండి మీరు' అని పక్కవారికి, మహిళలకు, పిల్లలకు ముందుగా భోజనం చేసే అవకాశం ఇచ్చి తాను వెనక్కు ఉంటాడా?

ఎంత 'చదువు'కున్నా, కూర్చునే కుర్చీ ఎంతటిదయినా, పలికే మాటలు ఎంత బరువైనవైనా - ఈ 'బఫ్ఫే' టేస్ట్ చాలా నిర్దాక్షిణ్యంగా, వారి సంస్కారానికి ఖచ్చితమైన 'మార్కులు వేసి మరీ' చూపెడుతుంది.

ఈ అలొచనలన్నీ మొన్న ఓ పెళ్ళికి వెళ్ళినప్పుడు, అక్కడ చూసిన దృశ్యాల నుండి ఉద్భవించినవి.

20, మార్చి 2010, శనివారం

ఆడకూతురా నీకు అడుగడుగున వందనం


Why cannot women be like men? అని అడుగుతాడు George Bernard Shah  నాటకం "పిగ్మాలియన్" లో ప్రొఫెసర్ హిగ్గిన్స్... ఆడువారు మగవారిల ఎందుకుండరూ - అని అతగాడి ఆవేదన...

కాని, అలా ఉంటే ఈ సృష్టియే లేదు కదా! అంచేత ఇంచుమించు ప్రపంచ జనాభాలో సగం స్త్రీలే నిండుకొనియున్నారు.


పుట్టకముందే చంపేసే సైన్సు ఏర్పాట్లున్నా, పుట్టాక చెత్తకుండీలలోకి విసిరేస్తున్నా, పెళ్ళయ్యాక కిరోసిన్ తో అభిషేకించి అగ్గిపుల్ల పెట్టేసే భర్తలు, అత్తలు ఉన్నా స్త్రీలు ఉన్నారున్నారు.

ఆ ఉన్నవాళ్ళెలాగున్నారయ్యా అంటే -
దళితులకంటే దళితంగా ఉన్నారు.
అర్ధంకన్నా ఎక్కువ అపార్ధాలకు గురవుతూ ఉన్నారు.
మానం కన్నా అవమానం పాలవుతూ ఉన్నారు.
సుఖం కన్నా ఎక్కువ దుఃఖం ఎక్కువగా మింగుతున్న నీలకంటలుగా ఉంటున్నారు.

తల్లులై కంటున్నారు; చెల్లెళై చెలువంపు సిరులొలికిస్తున్నారు. సతులై పతుల నలరిస్తున్నారు. పైలట్లై విమానాలు నడుపుతున్నారు. ప్రధానులై దేశాల నేలుతున్నారు. ఉద్యమ నేతలై రాజకీయ నాయకుల నూపుతున్నారు.
అందానికి అందమై, ఆనందానికి అర్ణవమై, త్యాగానికి నిర్వచనమై, ప్రేమకు పసిఫిక్కులై సృష్టికి అర్ధం కల్పిస్తున్నారు.

కానీ
వారు ఏడుస్తున్నారు. ఏడుస్తూ బతుకుతున్నారు. కారని కన్నీటి సాగరాలను ఎదలో ఘనీభవించుకుని, మాటల్లో, చేతల్లో మమతలు నింపుకుని మగవారింకా ఆటవికులుగానే ఎందుకు మిగిలిపోతున్నారో తెలియక, వారిని నాగరికులుగా చేయడానికింకా ఎన్ని ప్రేమ యుగాలు, ఎన్ని త్యాగ కల్పాలు దాటాలో లెక్క తెలియక నవ్వుతూ, నవ్విస్తూ బతుకుతున్నారు.

'గోమాత' అని కనుమ పండుగనాడు పూజిస్తాము. ముఖానికి పసుపు రాసి ఆవును ముట్టుకుని కళ్ళ కద్దుకుంటాము. కానీ, బక్కచిక్కిన ఆవులు, వాల్ పోస్టర్లు భోంచేసే దూడలు, కాడి బరువుకు మేడలు పుండ్లైన ఎద్దులు - వీటిని గురించి పట్టించుకోము.

మన పూజలన్నీ నటనలే!
వనితల విషయంలోనూ అంతే!
ఆది శక్తి, పరాశక్తి అని అష్టోత్తరాలు చదువుతాము కానీ ఆడది ఒక వ్యక్తిగా తన మామూలు శక్తిని, స్వాతంత్ర్యాన్ని అడిగితే ఇవ్వడానికి జంకుతాము. ఇంటిలో తల్లిగా, తనయగా, భార్యగా తన బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత ఆ అలసటను తుడిచిపెట్టుకుని చదువుకనో, ఉద్యోగానికనో వీధిలోకి వస్తే చాలు ఆ తల్లిని మనం బస్సులో, బజార్లో, వీధుల్లో, కార్యాలయాల్లో పెట్టె బాధలు చూచి కీచకులు, సైంధవులు సైతం సిగ్గుతో తల వంచుకుంటారు.

భారతీయ సంస్కృతీ వైభవం గురించి మాట్లాడే వారందరూ వారింట ఆడువరినెట్లా పరిగణిస్తున్నారు అని అడిగితే మాటలు మాటలేనా కావా అని తేలుతుంది.

ఇరవయ్యోకటవ శతాబ్దంలో ఉన్న మనం, సమాజంలోని సగభాగాన్ని ఇంత నిర్దయతో నికృష్టంగా చూస్తూ కూడా నాగరికులమని చెప్పుకోవడం తగునా?

"రా! నా చేయిలో నీ చేయి కలుపు. ఇద్దరమూ స్నేహితులమై ఈ జీవిత సాగరాన్ని మైత్రి నౌక మీద దాటుదాము. మన అనురాగపు ప్రతీకలను సృజించి తద్వారా ప్రగతిశీల ప్రకృతికి చేయుతనిద్దాము. ఇలమీద మనిషి దేవుడయ్యే ఆ పరిణామ యజ్ఞానికి సమిధలుగా వెలుగుదాము" అని పాణిగ్రహణం చేసే సుముహుర్తాన కోటి అరకోటి అంటూ కరెన్సీ నోట్లను, కారును, బండిని, కంచాన్ని, మంచాన్ని అడిగే వాడిని పసుపు బట్టల భిక్షగాడందామా, రెండు కాళ్ళ జంతువందమా?


మగవాడు కనుక పెళ్ళయాక తాను అత్తవారింటికి వెళ్లి, అక్కడి పరిస్థితులకూ, వ్యక్తులకు సర్దుకుని తానా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఇమడడానికి మానసికంగా, శారీరకంగా అష్టకష్టాలు పడవలసి వస్తే - సమాజం ఇట్లా ఉండేదా?


మగవాడు కనుక గర్భం దాల్చి, నవమాసాలు మోసి, తన శరీరం చీల్చుకుని శిశువును కనవలసి వస్తే మన చట్టాలు ఇలాగే ఉండేనా?

పాట పేరుతో, డాన్స్ పేరుతో, సినిమాలలో నాయికను గిల్లి, లాగి, కొట్టి, నలిపి, తొక్కి, తన్ని తోసి వినోదం అందించే దర్శక మహాశాయులను అలా అలా ట్యాంక్ బ్యాండ్ వెంబడో, కోటీ వెంబడో సదరు కృత్యాలకు గురిచేస్తే మన వినోదాల ప్రమాణా లిలాగే ఉండేనా?


చట్టాలకేమి ఉన్నాయి.

కోర్తులకేమి ఉన్నయున్నాయి.
కవితలు, వ్యాసాలు, సంపాదకీయాలు, బ్లాగు టపాలు వర్షిస్తూనే ఉన్నాయి - నారీమణుల కన్నీటి ధారల వలె. కానీ మహిళల జీవితాలు నానాటికీ కంటకావృతా లవుతున్నాయి - అంతే దానికి ఒక్కటే కారణం!

మగవాడు మారకపోవడం!

మగవాడి మనసులో మొదట స్త్రీ తనతో సమానమైన వ్యక్తి అన్న భావం నెలకొనకపోవడం.

శీలం పేరుతో తాను సృష్టించిన కొలమానాలను తను మాత్రం ఉల్లంఘిస్తూ, అదే పనిచేస్తే ఆమెను సంప్రదాయ శిలువకు నీతుల మేకులతో కొట్టే ద్వంద్వ ప్రమాణాలను పాటించడం!

మగవారినట్లా వారి తల్లులు పెంచడం, సమాజం అదే దృష్టిని రకరకాలుగా సమర్ధించడం, రచనలు కార్టూన్లు, సినిమాలు, ప్రకటనలు ( 'ఫలానా డిటర్జంటు వాడడం వల్ల నా చేతులు మంటలెక్కిపోతున్నాయి' అని ఒక్కసారి కూడా పురుషుని చూపించరేం? ) - అన్నీ కూడా ఈ ఎగుడు దిగుడు మనస్తత్వాలను పోషించడమే!


ఈ యుగానికి అనుగుణంగా భారతీయ వనిత అద్భుతంగా మారింది. ఇంటా బయటా అన్నింటినీ చక్కని సమన్వయంతో సర్దుకొని మరీ ఎక్కడికక్కడ సర్దుకుపోతూంది.

కానీ ఆమె చేతి వంటతోబాటూ ఆమె జీవితాన్ని కూడా తింటున్న పతి దేవులంగారు మాత్రం ఆమె తన పక్కనే తనంత ఎత్తుగా నడవడం హర్షించలేకపోతున్నాడు. కుటుంబ వ్యవస్థ ఇంకా - ఈ దేశంలో సుస్థిరంగా ఉంది అంటే ఆ వట వృక్షానికి శ్రీ 'సీత' రక్షలు నారీమణులే!

కలకంటి కంట కన్నీరొలుకుతున్నంత కాలం ఇలమీద నాగరిక జీవనం రానట్లే సుమా!


స్త్రీలు లేని లోకం
'చంద్రిక లేని నిశా గగనము, దీపిక లేని మందిరము, ఇన దీప్తి లేని దుర్దినము' అంటారు భాస్కర రామాయణములో. ఆ వెలుగు దివ్వెలు కొడిగట్టకుండా చూడడం అందరమూ అనుక్షణమూ గుర్తుంచుకోవలసిన కర్తవ్యం.

* * * * *
పై వ్యాసం వాకాటి పాండురంగారావు గారు వ్రాసింది. చాలా నచ్చింది. ముక్కుసూటిగా అయన చెప్పిన విషయాలు వినడానికి/చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా అవి పచ్చి నిజాలు. (అందుకేనేమో నాకు చాలా చాలా నచ్చేసింది) అందుకే ఇక్కడ ఉంచాను.

10, మార్చి 2010, బుధవారం

ఒక జీవితం

ఈ మధ్య ఎవరిని కలసి 'ఎలా ఉన్నారు?' అని అడిగినా 'ఏదో ఇలా ఉన్నాను. Life boring గా ఉంది. అలా సాగిపోతుందంతే...' అంటున్నారు. మొదట్లో ఇది ఏ ఒకరిద్దరిదో లేక కొంతమందిదో అనుకున్నాను (of course, నేనూ అలంటి స్థితి నుంచి బయటపడ్డ వాడినే లెండి). కానీ కొంత పరీక్షించి చూస్తే ఈ సమస్య చాలా మందిలో ఉండనిపించక మానదు.
ఎందుకు వీరందరికీ జీవితం మీద ఇంత నిరాసక్తత? జీవితమంటే ఏడు రంగుల హరివిల్లు, ఓ అందమైన అనుభూతి అంటారే? అన్నీ ఉత్త మాటలేనా?
నిరాసక్తత అంటే కేవలం ఉద్యోగం రాకపోవడం వల్లనో, ఆర్ధిక ఇబ్బందుల లేక వేరొక కారణాల వల్లనో వచ్చేది మాత్రమే కాదు. అంతా బాగానే ఉంటుంది... జీవితం సాఫీగా సాగుతుంటుంది... అయినా ఏదో కోల్పోయిన (లేని) లోటు మనసుని కలవరపరుస్తుంటుంది.
ఇదంతా కేవలం జీవిత పరమార్ధం తెలియకపోవటం వల్లనేనా అనిపించింది.
అసలు జీవితం అంటే ఏంటి? మానవుడి జీవిత పరమార్ధం ఏమిటి? జీవితానికి సార్ధకత అనేది ఉంటుందా?
చదువుకోవడం (స్కూల్లో, కాలేజీల్లో), ఉద్యోగం (చిన్నదో, పెద్దదో) సంపాదించడం, ఆకర్షణీయమైన లేక సరిపడా సంపాదన లభించాక పెళ్లి చేసుకోవడం. తర్వాత ఒక ఇల్లు/ఫ్లాటు కట్టుకొని/కొనుక్కొని... వీలైతే ఓ విదేశియనం చేసి... పిల్లలను కని... వారిని పెంచి పెద్ద చేసి... వారికీ పెళ్ళిళ్ళు చేసి... ఏ farm house లోనో... దైవచింతనలోనో... ఖర్మ కాలి ఎవడూ పట్టించుకోకపోతే Oldage Home లోనో తనువు చలించాలి.
ఇదేనా సగటు మనిషి జీవితం? ఇంతేనా? ఇంకేం లేదా?
ఈ మటుమాయల నటనలలో పడి మనం ఇక్కడకొచ్చిన ముఖ్యమైన పని మరచిపోతున్నమేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి.
...ఆలోచిస్తుంటే నేను వైరాగ్యంలో పడుతున్ననేనో అనిపిస్తుంది. వేదాంతం మనిషిని స్వచ్చంగా చేయడం ఎంతవరకు నిజమో తెలియదుగాని బాహ్య ప్రపంచానికి దూరం చేస్తునదేని మాత్రం నిజం.

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

దగ్ధగీతం - Dagdhageetham


ఎక్కడ అగ్ని జ్వలించినా
ఇక్కడ దగ్ధగీతమై
పొగలు చిమ్మేది మాత్రం నేనే...

ఒక సనాతన మూఢత్వం
జాతర్లో గొర్రెపిల్ల గొంతు కోసినట్లు;
ముఠాకక్షల సుదీర్ఘ ప్రతీకారం
నిండు చూలాలైన బత్తాయితోట
ఉసురు తీసినట్లు;
ఒకానొక నిరుపమాన ఉద్రేకం
నాకు మరణశాసనం లిఖిస్తుంది

రాస్తారోకో బుసలు కొట్టినపుడో
బంద్ సునామి విలయతాండవం చేసినపుడో...
నన్ను నేను ఆఖరిసారిగా
చూసుకుంటాను...
నడివీధిలోనే మీరు
నాకు తలకొరివి పెడతారు...
జవనాశ్వంలా కదం తొక్కే నేను
మసిబారిన అస్తిపంజరమై
మీ అనంత మూర్ఖత్వానికి
మృత సాక్ష్యంగా నిలబడతాను...

బహుదూరపు మనసులతో
చిరకాలపు మమతల్ని ముడేసే
గమన బంధువును నేను...

సామాన్య మానవుడి
పుష్పక విమానాన్ని నేను...

కల్చ
డానికీ వెలిగించడానికీ
మధ్య ఉన్న తాత్త్విక వ్యత్యాసాన్ని
మీ చేతిలోని అగ్గిపుల్లనడిగి తెలుసుకోండి

పాద లేపనాన్ని
జారవిడుచుకున్న ప్రవరాఖ్యు
ణ్ణి
పుట్టెడు దుఃఖం వరించినట్లు
ప్రగతి రథచక్రం ప్రాణం తీసే
ఉన్మాద భాస్మాసురులరా
నా చితిమంటల సెగలు
రేపు మీ రూపాయినోటును హరించకమానవు;

నిరసించడమెలాగో తెలియని
అనుభవజ్ఞులయిన ఆందోళనకారులరా
వారసత్వాన్ని ఆరగించే
సర్పజాతిలా
మీ అపార సంపదల్ని
మీరే తగలబెట్టుకోవద్దు
ఎందుకంటే
మీ చేతులు కాలిన తరువాత
పట్టుకోవడానికి ఆకులు కూడా
మిగలవు సుమా...

అత్యాధునిక బుద్దిమంతులరా!
నన్ను కాదు...
తక్షణం దగ్ధం చేయాల్సినవి
ఈ దేశంలో ఎన్నో ఉన్నాయిరా!

ఆదివారం ఆంధ్రజ్యోతి సంచికలో ఈ కవిత చదవగానే మనసు కలుక్కుమంది... బస్సుకే ప్రాణం ఉంటే అచ్చం తన ఆవేదనను ఇలానే వెలిబుచ్చేదా అనిపించింది. నేడు ఇలాంటి సామజిక చైతన్యం కలిగించే కవితల అవసరం మన సమాజానికి చాలా ఉంది. ఈ కవితను మీకూ చూపిద్దామని దీని రచయిత కోయి కోటేశ్వరరావు గారి అనుమతితో ఇక్కడ ఉంచుతున్నాను. ఇంత అద్భుతంగా రాసినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు.