12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

దగ్ధగీతం - Dagdhageetham


ఎక్కడ అగ్ని జ్వలించినా
ఇక్కడ దగ్ధగీతమై
పొగలు చిమ్మేది మాత్రం నేనే...

ఒక సనాతన మూఢత్వం
జాతర్లో గొర్రెపిల్ల గొంతు కోసినట్లు;
ముఠాకక్షల సుదీర్ఘ ప్రతీకారం
నిండు చూలాలైన బత్తాయితోట
ఉసురు తీసినట్లు;
ఒకానొక నిరుపమాన ఉద్రేకం
నాకు మరణశాసనం లిఖిస్తుంది

రాస్తారోకో బుసలు కొట్టినపుడో
బంద్ సునామి విలయతాండవం చేసినపుడో...
నన్ను నేను ఆఖరిసారిగా
చూసుకుంటాను...
నడివీధిలోనే మీరు
నాకు తలకొరివి పెడతారు...
జవనాశ్వంలా కదం తొక్కే నేను
మసిబారిన అస్తిపంజరమై
మీ అనంత మూర్ఖత్వానికి
మృత సాక్ష్యంగా నిలబడతాను...

బహుదూరపు మనసులతో
చిరకాలపు మమతల్ని ముడేసే
గమన బంధువును నేను...

సామాన్య మానవుడి
పుష్పక విమానాన్ని నేను...

కల్చ
డానికీ వెలిగించడానికీ
మధ్య ఉన్న తాత్త్విక వ్యత్యాసాన్ని
మీ చేతిలోని అగ్గిపుల్లనడిగి తెలుసుకోండి

పాద లేపనాన్ని
జారవిడుచుకున్న ప్రవరాఖ్యు
ణ్ణి
పుట్టెడు దుఃఖం వరించినట్లు
ప్రగతి రథచక్రం ప్రాణం తీసే
ఉన్మాద భాస్మాసురులరా
నా చితిమంటల సెగలు
రేపు మీ రూపాయినోటును హరించకమానవు;

నిరసించడమెలాగో తెలియని
అనుభవజ్ఞులయిన ఆందోళనకారులరా
వారసత్వాన్ని ఆరగించే
సర్పజాతిలా
మీ అపార సంపదల్ని
మీరే తగలబెట్టుకోవద్దు
ఎందుకంటే
మీ చేతులు కాలిన తరువాత
పట్టుకోవడానికి ఆకులు కూడా
మిగలవు సుమా...

అత్యాధునిక బుద్దిమంతులరా!
నన్ను కాదు...
తక్షణం దగ్ధం చేయాల్సినవి
ఈ దేశంలో ఎన్నో ఉన్నాయిరా!

ఆదివారం ఆంధ్రజ్యోతి సంచికలో ఈ కవిత చదవగానే మనసు కలుక్కుమంది... బస్సుకే ప్రాణం ఉంటే అచ్చం తన ఆవేదనను ఇలానే వెలిబుచ్చేదా అనిపించింది. నేడు ఇలాంటి సామజిక చైతన్యం కలిగించే కవితల అవసరం మన సమాజానికి చాలా ఉంది. ఈ కవితను మీకూ చూపిద్దామని దీని రచయిత కోయి కోటేశ్వరరావు గారి అనుమతితో ఇక్కడ ఉంచుతున్నాను. ఇంత అద్భుతంగా రాసినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు.