20, మార్చి 2010, శనివారం

ఆడకూతురా నీకు అడుగడుగున వందనం


Why cannot women be like men? అని అడుగుతాడు George Bernard Shah  నాటకం "పిగ్మాలియన్" లో ప్రొఫెసర్ హిగ్గిన్స్... ఆడువారు మగవారిల ఎందుకుండరూ - అని అతగాడి ఆవేదన...

కాని, అలా ఉంటే ఈ సృష్టియే లేదు కదా! అంచేత ఇంచుమించు ప్రపంచ జనాభాలో సగం స్త్రీలే నిండుకొనియున్నారు.


పుట్టకముందే చంపేసే సైన్సు ఏర్పాట్లున్నా, పుట్టాక చెత్తకుండీలలోకి విసిరేస్తున్నా, పెళ్ళయ్యాక కిరోసిన్ తో అభిషేకించి అగ్గిపుల్ల పెట్టేసే భర్తలు, అత్తలు ఉన్నా స్త్రీలు ఉన్నారున్నారు.

ఆ ఉన్నవాళ్ళెలాగున్నారయ్యా అంటే -
దళితులకంటే దళితంగా ఉన్నారు.
అర్ధంకన్నా ఎక్కువ అపార్ధాలకు గురవుతూ ఉన్నారు.
మానం కన్నా అవమానం పాలవుతూ ఉన్నారు.
సుఖం కన్నా ఎక్కువ దుఃఖం ఎక్కువగా మింగుతున్న నీలకంటలుగా ఉంటున్నారు.

తల్లులై కంటున్నారు; చెల్లెళై చెలువంపు సిరులొలికిస్తున్నారు. సతులై పతుల నలరిస్తున్నారు. పైలట్లై విమానాలు నడుపుతున్నారు. ప్రధానులై దేశాల నేలుతున్నారు. ఉద్యమ నేతలై రాజకీయ నాయకుల నూపుతున్నారు.
అందానికి అందమై, ఆనందానికి అర్ణవమై, త్యాగానికి నిర్వచనమై, ప్రేమకు పసిఫిక్కులై సృష్టికి అర్ధం కల్పిస్తున్నారు.

కానీ
వారు ఏడుస్తున్నారు. ఏడుస్తూ బతుకుతున్నారు. కారని కన్నీటి సాగరాలను ఎదలో ఘనీభవించుకుని, మాటల్లో, చేతల్లో మమతలు నింపుకుని మగవారింకా ఆటవికులుగానే ఎందుకు మిగిలిపోతున్నారో తెలియక, వారిని నాగరికులుగా చేయడానికింకా ఎన్ని ప్రేమ యుగాలు, ఎన్ని త్యాగ కల్పాలు దాటాలో లెక్క తెలియక నవ్వుతూ, నవ్విస్తూ బతుకుతున్నారు.

'గోమాత' అని కనుమ పండుగనాడు పూజిస్తాము. ముఖానికి పసుపు రాసి ఆవును ముట్టుకుని కళ్ళ కద్దుకుంటాము. కానీ, బక్కచిక్కిన ఆవులు, వాల్ పోస్టర్లు భోంచేసే దూడలు, కాడి బరువుకు మేడలు పుండ్లైన ఎద్దులు - వీటిని గురించి పట్టించుకోము.

మన పూజలన్నీ నటనలే!
వనితల విషయంలోనూ అంతే!
ఆది శక్తి, పరాశక్తి అని అష్టోత్తరాలు చదువుతాము కానీ ఆడది ఒక వ్యక్తిగా తన మామూలు శక్తిని, స్వాతంత్ర్యాన్ని అడిగితే ఇవ్వడానికి జంకుతాము. ఇంటిలో తల్లిగా, తనయగా, భార్యగా తన బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత ఆ అలసటను తుడిచిపెట్టుకుని చదువుకనో, ఉద్యోగానికనో వీధిలోకి వస్తే చాలు ఆ తల్లిని మనం బస్సులో, బజార్లో, వీధుల్లో, కార్యాలయాల్లో పెట్టె బాధలు చూచి కీచకులు, సైంధవులు సైతం సిగ్గుతో తల వంచుకుంటారు.

భారతీయ సంస్కృతీ వైభవం గురించి మాట్లాడే వారందరూ వారింట ఆడువరినెట్లా పరిగణిస్తున్నారు అని అడిగితే మాటలు మాటలేనా కావా అని తేలుతుంది.

ఇరవయ్యోకటవ శతాబ్దంలో ఉన్న మనం, సమాజంలోని సగభాగాన్ని ఇంత నిర్దయతో నికృష్టంగా చూస్తూ కూడా నాగరికులమని చెప్పుకోవడం తగునా?

"రా! నా చేయిలో నీ చేయి కలుపు. ఇద్దరమూ స్నేహితులమై ఈ జీవిత సాగరాన్ని మైత్రి నౌక మీద దాటుదాము. మన అనురాగపు ప్రతీకలను సృజించి తద్వారా ప్రగతిశీల ప్రకృతికి చేయుతనిద్దాము. ఇలమీద మనిషి దేవుడయ్యే ఆ పరిణామ యజ్ఞానికి సమిధలుగా వెలుగుదాము" అని పాణిగ్రహణం చేసే సుముహుర్తాన కోటి అరకోటి అంటూ కరెన్సీ నోట్లను, కారును, బండిని, కంచాన్ని, మంచాన్ని అడిగే వాడిని పసుపు బట్టల భిక్షగాడందామా, రెండు కాళ్ళ జంతువందమా?


మగవాడు కనుక పెళ్ళయాక తాను అత్తవారింటికి వెళ్లి, అక్కడి పరిస్థితులకూ, వ్యక్తులకు సర్దుకుని తానా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఇమడడానికి మానసికంగా, శారీరకంగా అష్టకష్టాలు పడవలసి వస్తే - సమాజం ఇట్లా ఉండేదా?


మగవాడు కనుక గర్భం దాల్చి, నవమాసాలు మోసి, తన శరీరం చీల్చుకుని శిశువును కనవలసి వస్తే మన చట్టాలు ఇలాగే ఉండేనా?

పాట పేరుతో, డాన్స్ పేరుతో, సినిమాలలో నాయికను గిల్లి, లాగి, కొట్టి, నలిపి, తొక్కి, తన్ని తోసి వినోదం అందించే దర్శక మహాశాయులను అలా అలా ట్యాంక్ బ్యాండ్ వెంబడో, కోటీ వెంబడో సదరు కృత్యాలకు గురిచేస్తే మన వినోదాల ప్రమాణా లిలాగే ఉండేనా?


చట్టాలకేమి ఉన్నాయి.

కోర్తులకేమి ఉన్నయున్నాయి.
కవితలు, వ్యాసాలు, సంపాదకీయాలు, బ్లాగు టపాలు వర్షిస్తూనే ఉన్నాయి - నారీమణుల కన్నీటి ధారల వలె. కానీ మహిళల జీవితాలు నానాటికీ కంటకావృతా లవుతున్నాయి - అంతే దానికి ఒక్కటే కారణం!

మగవాడు మారకపోవడం!

మగవాడి మనసులో మొదట స్త్రీ తనతో సమానమైన వ్యక్తి అన్న భావం నెలకొనకపోవడం.

శీలం పేరుతో తాను సృష్టించిన కొలమానాలను తను మాత్రం ఉల్లంఘిస్తూ, అదే పనిచేస్తే ఆమెను సంప్రదాయ శిలువకు నీతుల మేకులతో కొట్టే ద్వంద్వ ప్రమాణాలను పాటించడం!

మగవారినట్లా వారి తల్లులు పెంచడం, సమాజం అదే దృష్టిని రకరకాలుగా సమర్ధించడం, రచనలు కార్టూన్లు, సినిమాలు, ప్రకటనలు ( 'ఫలానా డిటర్జంటు వాడడం వల్ల నా చేతులు మంటలెక్కిపోతున్నాయి' అని ఒక్కసారి కూడా పురుషుని చూపించరేం? ) - అన్నీ కూడా ఈ ఎగుడు దిగుడు మనస్తత్వాలను పోషించడమే!


ఈ యుగానికి అనుగుణంగా భారతీయ వనిత అద్భుతంగా మారింది. ఇంటా బయటా అన్నింటినీ చక్కని సమన్వయంతో సర్దుకొని మరీ ఎక్కడికక్కడ సర్దుకుపోతూంది.

కానీ ఆమె చేతి వంటతోబాటూ ఆమె జీవితాన్ని కూడా తింటున్న పతి దేవులంగారు మాత్రం ఆమె తన పక్కనే తనంత ఎత్తుగా నడవడం హర్షించలేకపోతున్నాడు. కుటుంబ వ్యవస్థ ఇంకా - ఈ దేశంలో సుస్థిరంగా ఉంది అంటే ఆ వట వృక్షానికి శ్రీ 'సీత' రక్షలు నారీమణులే!

కలకంటి కంట కన్నీరొలుకుతున్నంత కాలం ఇలమీద నాగరిక జీవనం రానట్లే సుమా!


స్త్రీలు లేని లోకం
'చంద్రిక లేని నిశా గగనము, దీపిక లేని మందిరము, ఇన దీప్తి లేని దుర్దినము' అంటారు భాస్కర రామాయణములో. ఆ వెలుగు దివ్వెలు కొడిగట్టకుండా చూడడం అందరమూ అనుక్షణమూ గుర్తుంచుకోవలసిన కర్తవ్యం.

* * * * *
పై వ్యాసం వాకాటి పాండురంగారావు గారు వ్రాసింది. చాలా నచ్చింది. ముక్కుసూటిగా అయన చెప్పిన విషయాలు వినడానికి/చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా అవి పచ్చి నిజాలు. (అందుకేనేమో నాకు చాలా చాలా నచ్చేసింది) అందుకే ఇక్కడ ఉంచాను.

10, మార్చి 2010, బుధవారం

ఒక జీవితం

ఈ మధ్య ఎవరిని కలసి 'ఎలా ఉన్నారు?' అని అడిగినా 'ఏదో ఇలా ఉన్నాను. Life boring గా ఉంది. అలా సాగిపోతుందంతే...' అంటున్నారు. మొదట్లో ఇది ఏ ఒకరిద్దరిదో లేక కొంతమందిదో అనుకున్నాను (of course, నేనూ అలంటి స్థితి నుంచి బయటపడ్డ వాడినే లెండి). కానీ కొంత పరీక్షించి చూస్తే ఈ సమస్య చాలా మందిలో ఉండనిపించక మానదు.
ఎందుకు వీరందరికీ జీవితం మీద ఇంత నిరాసక్తత? జీవితమంటే ఏడు రంగుల హరివిల్లు, ఓ అందమైన అనుభూతి అంటారే? అన్నీ ఉత్త మాటలేనా?
నిరాసక్తత అంటే కేవలం ఉద్యోగం రాకపోవడం వల్లనో, ఆర్ధిక ఇబ్బందుల లేక వేరొక కారణాల వల్లనో వచ్చేది మాత్రమే కాదు. అంతా బాగానే ఉంటుంది... జీవితం సాఫీగా సాగుతుంటుంది... అయినా ఏదో కోల్పోయిన (లేని) లోటు మనసుని కలవరపరుస్తుంటుంది.
ఇదంతా కేవలం జీవిత పరమార్ధం తెలియకపోవటం వల్లనేనా అనిపించింది.
అసలు జీవితం అంటే ఏంటి? మానవుడి జీవిత పరమార్ధం ఏమిటి? జీవితానికి సార్ధకత అనేది ఉంటుందా?
చదువుకోవడం (స్కూల్లో, కాలేజీల్లో), ఉద్యోగం (చిన్నదో, పెద్దదో) సంపాదించడం, ఆకర్షణీయమైన లేక సరిపడా సంపాదన లభించాక పెళ్లి చేసుకోవడం. తర్వాత ఒక ఇల్లు/ఫ్లాటు కట్టుకొని/కొనుక్కొని... వీలైతే ఓ విదేశియనం చేసి... పిల్లలను కని... వారిని పెంచి పెద్ద చేసి... వారికీ పెళ్ళిళ్ళు చేసి... ఏ farm house లోనో... దైవచింతనలోనో... ఖర్మ కాలి ఎవడూ పట్టించుకోకపోతే Oldage Home లోనో తనువు చలించాలి.
ఇదేనా సగటు మనిషి జీవితం? ఇంతేనా? ఇంకేం లేదా?
ఈ మటుమాయల నటనలలో పడి మనం ఇక్కడకొచ్చిన ముఖ్యమైన పని మరచిపోతున్నమేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి.
...ఆలోచిస్తుంటే నేను వైరాగ్యంలో పడుతున్ననేనో అనిపిస్తుంది. వేదాంతం మనిషిని స్వచ్చంగా చేయడం ఎంతవరకు నిజమో తెలియదుగాని బాహ్య ప్రపంచానికి దూరం చేస్తునదేని మాత్రం నిజం.