5, నవంబర్ 2010, శుక్రవారం

ఏడవ వ్యసనంలోకంలో వ్యసనాలు ఏడు రాకాలుగా ఉంటాయనీ, వాటినే సప్త వ్యసనాలంటారనీ శాస్త్రం చెప్తోంది. వాటిలో ఏడవ వ్యసనం అర్థ సందూషణం.
అర్థ - తాతలూ, తండ్రులూ ఆర్జించిన ద్రవ్యాన్ని, సందూషణం - ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టడం
ఈ వ్యసనానికి ఉదాహరణ దుర్యోధనుడు. లోకంలో ఎవరూ కూడా తాము సంపాదించిన డబ్బుని అంత తేలికగా ఖర్చు పెట్టలేరు. అప్పనంగా వచ్చిన సొమ్ముని మాత్రం వేగంగానూ, తేలికగానూ ఖర్చు పెట్టడానికి వెనకాడరు. దీనికి కారణం సంపాదించడంలో ఉండే కష్టమేమిటో తెలియకపోవడమే! ఏనాడో శంతనుడనే మహానుభావుడు తన పుత్రుడైన భీష్మునికి రాజ్యాన్ని అందజేస్తే, ఆ భీష్ముడు కౌరవ పాండవులకి చేరిసగంగా రాజ్యాన్ని పంచితే అదికాస్తా అస్తవ్యస్తమై పాండవుల రాజ్యాన్ని అపహరించడం కోసం దుర్యోధనుడు అనేకమైన దుష్ట ఉపాయాలని పన్నడానికి కారణమై కూర్చుంది. జూదం ఆడటం కోసం ఓ మహాభవనం, పాండవులు పడుతున్న అష్టకష్టాలని చూసి ఆనందించడం కోసం పెద్ద సైన్యంతో ఎంతో వ్యయంతో అరణ్యాలకి వెళ్ళడం, కృష్ణుడు రాయబారానికి వస్తుంటే పెద్ద మొత్తంలో వ్యయం చేసి ఎక్కడికక్కడ విడిది భావనల్ని కట్టించడం, రాజ్యాన్ని అపహరించడం కోసమే పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని (ఇరవైరెండు లక్షలమంది) నిరంతరం పోషించడం... ఇలా లెక్క లేకుండా ఖర్చు చేసాడు దుర్యోధనుడు. చివరికి ఊరు పేరు లేకుండా తొడలు విరిగి యుద్ధరంగంలో దురదృష్టకరమైన చావుని సానుభూతి లేని మరణాన్ని పొందాడు. ఈ సొమ్మునే హస్తినాపురం మీద వ్యయం చేసి ఉండి ఉంటే ఎంతో అద్భుతంగా ఆ నగరం తీర్చిదిద్దబడి ఉండేది. కాబట్టి వ్యర్థంగా ఖర్చు చేయడమనేది కూడా ఓ వ్యసనమే! అయితే దానిలో ఉండే ఇబ్బందిని వ్యసనపరుడు ఎదుర్కోడు. ఆ కష్టాన్ని తరువాతి వారు అనుభవించాల్సివస్తుంది.