25, జనవరి 2011, మంగళవారం

పరవాలేదు... పరవాలేదు...

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా పాటల్లో మొదటి సారి వినగానే ఇంతగా నచ్చిన పాట ఇదొక్కటే. ఎంత నచ్చిందంటే రెండు రోజుల్లో దాదాపు 50 సార్లు విన్నాను. ఇంకా వింటూనే ఉన్నాను. నిజంగా ఆ బాణీల్లో ఏదో మాయ ఉంది. అది వింటున్నంత సేపు ఏదో తెలియని సంతోషం... హాయిగా ఉంటుంది. ఏంటో ఈ విచిత్రం! ఇప్పటికే ఈ పాట మీద బోలెడన్ని బ్లాగు పోస్టులున్నా... నా సంతోషం కోసం మరొక్కసారి... :)


పరవాలేదు... పరవాలేదు...
చూడచక్క గున్నా లేకున్నా...ఏమ్ పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు.

పరవాలేదు... పరవాలేదు...
చూడచక్కగున్నా లేకున్నా... ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదుపరవాలేదు... పరవాలేదు...
ఊరు పేరు ఉన్నా లేకున్నా... ఏం పరవాలేదు
నువ్వు ఎవరైనా పర్లేదు... ఓ...

నీకు నాకు స్నేహం లేదు
నువ్వంటే కోపం లేదు
ఎందుకీ దాగుడుమూతలు అర్ధమే లేదు
మచ్చేదో ఉన్నాదనీ మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు!

పరవాలేదు... పరవాలేదు...
చూడచక్కగున్నా లేకున్నా... ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

ఉంగరాల జుట్టే లేదా? నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ ఐనా... మరి పర్లేదు

మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరిని
తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని..
అందంగా లేను అని... నిన్నెవరూ చూడరనీ
నువ్వెవరికి నచ్చవనీ... నీకెవ్వరు చెప్పారు?

ఎంత మంచి మనసో నీది
దానికన్నా గొప్పది లేదు
అందగాళ్ళు నాకెవ్వరూ ఇంత నచ్చలేదూ
నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదూ!

పరవాలేదు... పరవాలేదు...
చూడచక్కగా లేకున్నా ఏం పరవాలేదు
నువ్వెలా ఉన్నా పర్లేదు

అంతలేసి కళ్ళుండకున్నా... నాకు పర్లేదు
కోరమీసం లేకున్నాగానీ మరి పర్లేదు

పరదాలే ఎన్నాళ్ళిలా... అని నిన్నే అడగమని
సరదాగా తరిమింది... మది నీపై మనసు పడి

మురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకుని
అది నువ్వో కాదో అని సందేహం ప్రతిసారి


చేరదీసి లాలించలేదు... నన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరూ... ఇంత నచ్చలేదు
ఎవరేమన్నా సరే... నా చెయ్యి నిన్నింక వదిలేది లేదు

పరవాలేదు... పరవాలేదు...
చూడచక్కగున్నా లేకున్నా... ఏం పర్వాలేదు
నువ్వెలా వున్నా పర్లేదు.

పరవాలేదు... పరవాలేదు...
ఊరు పేరు ఉన్నా లేకున్నా ..ఏం పరవాలేదు
నువ్వు ఎవరైనా పర్లేదు

23, జనవరి 2011, ఆదివారం

సద్గురు శ్రీ త్యాగరాజ 164వ ఆరాధనోత్సవాలు

వేదుల బాలకృష్ణమూర్తి గారు త్యాగరాజ స్వామి వారి మీద రచించిన 'సప్త స్వర నీరాజనం' లోని ఈ పద్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో...

తియ్యని తెల్గుభాష కడతేర కృతుల్ రచియించి తంబురా
కొయ్యకు జీవదానమిడి కోమల కంఠము మేళగించి రా
మయ్యను భక్తి రూపమున ఆడియు,పాడి తరించినట్టి త్యా
గయ్యను సంస్మరింతు మన గానకళన్ వికసింప చేయగాన్

(మిగిలిన పద్యాల కొఱకు ఈ లంకెను దర్శించండి - http://vedula--baala.blogspot.com/2008/09/blog-post_1052.html)

నాద సుధారసంత్యాగరాయ గాన సభలో ప్రతి సంవత్సరం జరిపే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు ముందు 'త్యాగరాజ సంగీతోత్సవం' నిర్వహించడం ఆనవాయితీ అట. ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా త్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికలో 'నాదబ్రహ్మానంద' సద్గురు శ్రీ త్యాగరాజ సంగీతోత్సవం నిర్వహించారు. 
కీర్తనలు ఆలపించడానికి ఈ సారి రాజమండ్రి నుండి తులసి విశ్వనాధ్ గారు వచ్చారు. వీరితో పాటు వయోలిన్ సహకారం అందించడానికి శ్రీ పెరవలి నందకుమార్ గారు, మృదంగ సహకారం అందించడానికి శ్రీ పెరవలి జయభాస్కర్ గార్లు వచ్చారు. తులసి విశ్వనాధ్ గారు పాడిన ప్రతి కీర్తన ఓ అమృతపు జల్లు. ఎంత అద్భుతంగా పాడారంటే ఆవిడ పాడిన 'నిన్నే భజన..' కీర్తన ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. నందకుమార్ గారు వయోలిన్ తో, జయభాస్కర్ గారు మృదంగం మీద త్యాగరాజ కీర్తనలను అద్భుతంగా ఆలపించారు. వింటుంటే అలా వింటూనే ఉండిపోవాలనిపించింది.
'రహివుట్ట జంత్రగాత్రముల్ ఱాల్ కరగించు... విమలగాంధర్వంబు విద్య మాకు' అని సగర్వంగా ప్రకటించుకుంది అల్లసాని పెద్దన గారి మను చరిత్రములో వరూధిని. అంటే నాదమైనా, గాత్రమైనా మా సంగీతం రాళ్ళను సైతం కరిగిస్తుంది అని. సంగీతానికి అంతటి మహత్తర శక్తి ఉంది మరి!


ఈ నెల 24, 25, 26 తేదిలలో శ్రీ త్యాగరాయ గాన సభలో ఉ. 8.30 ని. నుండి రాత్రి 9 గంటల వరకు సద్గురు శ్రీ త్యాగరాజ 164వ ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి.

18, జనవరి 2011, మంగళవారం

ఆత్రేయ గారి జన్మ కుండలి - కవిత

మా ఇంట్లో చాలా పాత పుస్తకాలున్నాయి. నిన్న కాస్త తీరిక దొరికి మనకు పనికొచ్చేవి ఏమైనా దొరుకుతాయేమో అని ఇంట్లో ఉన్న పాత పుస్తకాలు సర్దుతుంటే ఇరవై ఏళ్ల కింద మా నాన్నగారు రాసుకున్న పుస్తకం ఒకటి దొరికింది. అది చదువుతున్నంత సేపు ఏదో లోకంలో విహరించినట్లనిపించింది. ఆ పుస్తకంలోని ఆసక్తికరమైన పుటల్లోని ఒకాకోన పుటలో ఈ కవిత కనిపించింది. ఆచార్య ఆత్రేయ గారు తన జన్మ కుండలిని వివరిస్తూ రాసిన ఈ కవితను అవథరించండి!
(దీనికి శీర్షిక ఏం పెట్టాలో కూడా తోచలేదు)
ర   కే
చం   శు
బు

కు

ఆచార్య ఆత్రేయ గారి జన్మ కుండలి


గు

రా


నిండు చీకటి నిశి రెండవ రిక్కలో
విల్లు లగ్నమునకు ఇల్లు కాగా
తొల్త నెలను అమ్మ తొలిచూలు బిడ్డగా
అవతరించినాను అవని మీద!

                      వింటికైదైన మేకపోతింటిలో
                      పగటి రేడును, రేరేడు, పాముతోక
                      రక్కసుల యొజ్జ, జాబిలి రంకు కొడుక
                      చేరి బ్రతుకును చిందర చేసినారు 

అయిదు గ్రహములు కూడి నన్నారు మూడు 
దారులకు లాగి చెడిపె నా తప్పు గాదు!

                      ఇంగిల దొర చేరే ఏడింటనొక్కడై
                      అడవిరాజు గూట నమరియుండె
                      వేల్పులయ్యవారి వెంట కుంటిదొరయు
                      తక్కెడింట పాము తలయు వెలసె!

తులను రాహువుండి తులలేని ధనమిచ్చి 
రండ సంతు గూర్చి రట్టు చేసే!
గురువులేని నాకు గురువు తోమ్మిదిలోన
నుండి కాచెనంట ఒడిదొడుకులు!

1, జనవరి 2011, శనివారం

కాల గమనం


ముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడి ఆవేశంతో ముందుకు వెళ్ళి వార్ధక్యంలో మానవుడిలా చల్లబడి నిదానించి... నీరై తలలు  వంచుకొని వెనక్కి వెళ్లిపోతాయి. ఈ మొత్తం నాటకాన్ని చూస్తున్న సముద్రం మాత్రం నిరంతరం కొత్త అలలను ముందుకు తోస్తూపాత అలలకు ఆశ్రయమిస్తుంటుంది. ఇది అనంతం. నిశ్చలమే కానీ చైతన్యశీలం!
సరిగ్గా కాలమూ ఇంతే...
కాలమే సముద్రం అయితే ఒక్కొక్క కాలెండర్ సంవత్సరమూ ఒక్కొక్క కెరటం.
2010 అని మనం అంకెతో పిలుచుకున్న సంవత్సరం అదృశ్యమైపోతూ2011 అన్న నూతన కాలసాగరపు కెరటం ముందుకొస్తున్న ముహూర్తం ఇది.
కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు అందరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం! ఈ సంవత్సరమైనా బాగుండాలని కొందరుపాత సంవత్సరం కంటే మెరుగుగా ఉండాలని ఇంకొందరు ఆశిస్తారు.
పాత అలవాట్లు మానాలనుకునేవారికికొత్త ఆలావాట్లు మొదలు పెట్టాలనుకునేవారికి ఇది అనువైన సమయం. అందుకే ఇప్పుడు చాలా మంది తమ భవిష్యత్ కార్యాచరణల ప్రణాళికల చిట్టాను తయారు చేసుకుంటుంటారు.
సమయ పాలన గురించి వాకాటి పాండురంగారావు గారు రాసిన వ్యాసం ఒకటి ఈ మధ్య చదివాను. ఆ స్పూర్తితో ఈ సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం సమయ పాలన. అందులోని కొన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన వాక్యాలు ఇక్కడ ఉంచుతున్నాను.

అరె అప్పుడే ఏడాది అయిపోయిందా?’ అంటాం మనం. అదే విచిత్రం!
కాలం కదలినట్టుండదు కానీ అనుక్షణం కదులుతుంటుంది.

ఉన్నట్లు యుండగా దరికి న్నరులను నావ జేర్చు క్రియ దాబో
కున్నట్ల యునికి కాలంబు న్నరులకు వయసు బుచ్చి మోసము  దెచ్చున్
అని ఆముక్తమాల్యదకారులు అన్నారు. అంటే -
పడవ ఎలాగైతే కదలకుండా ఉన్నట్లే ఉండి నరులను తీరానికి చేర్చుతుందో అలాగే కాలమూ కదలకుండా ఉన్నట్టుంటుంది, కానీ కదులుతూనే ఉంటుంది. హఠాత్తుగా ఒకనాడు మన బ్రతుకు కాలెండరులో ఆఖరి పేజీ రెపరెప లాడుతుంది.
అయ్యో! ఒక జీవిత కాలం అయిపోయిందే! నేను కాలం విలువ, జీవితం విలువ తెలియకుండా బ్రతికానే! అని మనసు విలవిలలాడుతుంది. కానీ అప్పటి వ్యధకు పరిష్కారం లేదు.
కనుక జీవితంలో ప్రతి నిమిషాన్నీ పదిలంగా పవిత్రంగా చూసుకోవాలి. జారిపోయిన క్షణం తిరిగి రాదనే స్పృహ గుండె లబ్-డబ్ లా స్పందిస్తుండాలి.
          జీవితం ప్రసాదించిన కాలం (ఆయుశ్శు) అనే గొప్ప కానుకతో మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న ఉదయించని జీవితం తెల్లవారని రాత్రి లాంటిది
          కాలమనే అనంతమైన కేక్ లో అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి వీలుగా తన ఊహ అనే కత్తితో మానవుడు కోసిన ముక్కే ఈ సంవత్సరం అనేది.

బ్లాగ్మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!