22, ఏప్రిల్ 2011, శుక్రవారం

క్షమయా ధరిత్రి!సముద్రవసనే దేవి | పర్వతస్తనమండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం | పాదస్పర్శం క్షమస్వమే|

అంటూ పొద్దున నిద్ర లేవగానే 'నీ మీద పాదం మోపుతున్నందుకు నన్ను క్షమించు తల్లీ!' అని భూదేవిని ప్రార్ధించే సంస్కృతి మనది. 
కానీ మనం... పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా కేవలం మన 'సౌకర్యం' కోసం హానికారకమైన పదార్ధాలను విచ్చలవిడిగా వాడుతూ భూమి మీద కాలుష్యం పెంచుతూ సర్వభ్రష్టత్వం చేస్తున్నాం.
మన కాలుకు దెబ్బ తగిలితే మనసు బాధ పడుతుంది, కళ్ళు కన్నీరు కారుస్తాయి, చేయి దానికి కారణమైన దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. మనం తగిన సమయంలో అవసరమైన జాగ్రత్త తీసుకోకపోతే సమస్య జటిలమై మరిన్ని అనర్ధాలకు దారి తీసి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది  
మనలాగే భూమి కూడా! కానీ దాని పరిమాణం పెద్దది కనుక పరిణామాలూ పెద్దవి, వాటి ప్రభావాన్ని చూపే సమయం కూడా ఎక్కువ. మనం ఇప్పుడు ఇక్కడ సృష్టించే కాలుష్యం వల్ల ఎక్కడో, ఎప్పుడో, ఎవరో బాధలు అనుభవించాల్సి వస్తుంది.
ప్రతిరోజు మనకు తెలియకుండానే ఎంతో కాలుష్యానికి మనం కారణం అవుతున్నాం. మిగిలినవన్నీ ఒక ఎత్తైతే... 'ప్లాస్టిక్' మహమ్మారి ఒక్కటే పుడమి తల్లి శరీరం మీద ఆరని వరణంలా మారింది. బాధ్యత కలిగిన మనుషులుగా మనం మన భూమాతను కాపాడుకోవాలి కానీ ఆ వ్రాణాన్ని తొలిచే జీవులం కాకూడదు. ఈ భూమి మనందరిదీ... బ్రతికున్నంత కాలం ఆలయంలా పరిశుభ్రంగా, జాగ్రత్తగా కాపాడుకుని భావి తరాలకు అందించడం మన బాధ్యత!
'క్షమయా ధరిత్రి' అన్నారు కదా... ఎంత కాలం భరిస్తూ క్షమిస్తుందో చూద్దాం అనుకుంటే మన గొయ్యి మనే తవ్వుకున్న వాళ్ళం అవుతాం. అంటా ఒక్కసారిగా మార్చడం మన వల్ల కాకపోవచ్చు కానీ మనకు వీలైనంతలో ప్లాస్టిక్ ని వాడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తే కొంతవరకైనా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినట్లవుతుంది.

ఈ ఎర్త్ డే పుణ్యమా అని కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా అందరం ఈ అనర్ధాన్ని గురించి ఆలోచిస్తున్నాం! ప్రతి ఎర్త్ డే కి కొందరైనా మారితే ఈ 'రోజు'కి సార్ధకత లభించినట్లే.