12, జూన్ 2011, ఆదివారం

యత్ర నార్యంతు పూజ్యంతే...

'ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్నా తియ్యని రాగం...'
అన్నారు సిరివెన్నెల గారు. అమ్మ గురించి రాస్తే అంత తీయగా ఉంటుందట!

మరి అలాంటి ఓ అమ్మ తన బిడ్డ మీద ఉన్న ప్రేమకు అక్షర రూపం ఇస్తే?
బుడిబుడి నడకల తన చిన్నారిని చూసి మురిసిపోతూ, సుతిమెత్తని చేతులతో ముఖంపై తడిమినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతిని పొందే తల్లి మనసును శ్రీ గారు తన చిట్టి బంగారానికి రాసిన లేఖలో అద్భుతంగా ఆవిష్కరించారు. 

"నిన్ను ఒక human being లాగ పెంచడం కంటే 'being human' గా పెంచడం నా ధ్యేయం చిన్నలు" అంటూ తన చిట్టి తల్లిని ఒక మంచి పౌరురాలిగా, సంస్కారవంతురాలిగా చేయాలనుకుంటుందట :)

తన పిల్లల్ని లాలించడంలో అమ్మ పొందే ఆనందమేంటో తెలియాలంటే ఆ బ్రహ్మ సైతం ఆడ జన్మ ఎత్తి అనుభూతి చెందాల్సిందేనట.

ఈ పోస్ట్ లో ఆవిడ ఒక వీడియొ షేర్ చేశారు. అందులో అండం పిండంగా మారి బ్రహ్మాండమై జీవం పోసుకునే విధానాన్ని అద్భుతంగా దృశ్య రూపకంగా వివరించారు. అది చూస్తుంటే, తల్లి ప్రకృతి ఎన్నెన్ని కోట్ల రహస్యాలను తనలో ఇముడ్చుకుందోనని ఆశ్చర్యపడాలా, ఆ తల్లి ప్రసాదించిన మెదడుతోనే ఈ సూక్ష్మ రహస్యాలను విడమరచి బట్టబయలు చేసిన సైంటిస్టులను చూచి అచ్చెరువొందాలా తేలడం లేదు!


ఇది చూశాక ఈ మధ్య చదివిన ఒక వ్యాసం గుర్తొచ్చింది. అందులో వాకాటి పాండురంగారావు గారు పురుషుడి వీర్యకణాలు స్త్రీలోకి ప్రవేశించి ఆమె గర్భాశయంలోని అండాన్ని చేరే యాత్ర గురించి వివరించారు. ఇక్కడ ఆ యాత్రలోని కొన్ని అద్భుతమైన ఘట్టాలు ఇక్కడ ఉంచుతున్నాను...

పురుషుడి నుండి ఒక్కసారి బయలుదేరినవి 30 కోట్ల వీర్య కణాలు. వాటి ధ్యేయం - స్త్రీ అండాన్ని కలవడం..! 
ఒకే అండం అటు, 30 కోట్ల వీర్య కణాలు ఇటు!
సెకండుకు 200 అంగుళాల వేగంతో బయలుదేరిన ఈ కణ వీరులు ఈదుకుంటూ అండం దగ్గరకు వెళ్ళేసరికి ఈ 30 కోట్లలోనూ, కేవలం 200 మాత్రమే మిగులుతారట! వీటిలో కూడా చివరకు గమ్యం చేరేది ఏ ఒక్కటోనట! అసలు ఆ ఒక్కటీ కూడా గమ్యానికవతలే హరీ మనవచ్చునట!
కానీ ఇంతమందితో పోటీపడి, చివరకు అలిసి సొలిసి తనలోకి చేరిన ఆ వీర్య కాణానికి స్త్రీ అండం గ్లూకోజ్ తో స్నానం చేయిస్తుందట! దాంతో ఆ కాణానికి కాస్త బలం చేకూరుతుందట.
అంటే - తల్లిగా, భార్యగా ఆడది మగవాడికి చేసే సేవలకు ఇక్కడా ప్రతిరూపం ఉందన్నమాట. మాతృత్వం ఆ అండంలో పొదిగిన చల్లదనం! అది లేకపోతే మనలో ఎవ్వరం ఉండేవాళ్ళం  కాదుకదా!

ఇందులో చెప్పుకోదగిన అద్భుతాలెన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పదలచుకున్నది ఒక్కటే...
పురుషుడు అంటే సంఖ్యాబలం రాశి
స్త్రీ అంటే నాణ్యత అనగా వాసి
స్త్రీని రక్షించడం, ఆమెని గౌరవించడం, ఆమెను అపురూపంగా చూసుకోవడం - అంటే నాణ్యతపట్ల, నాగరికత పట్ల మనం సుముఖులం అని చెప్పడమే కాని మరొకటి కాదు.
ఆ విలువలు లేనిది మానవ సమాజం అనిపించుకోదు!