23, డిసెంబర్ 2012, ఆదివారం

కొత్త నేస్తాలు


చిన్నప్పుడు కొత్త బూట్లు కానీ బ్యాగు కానీ కొనిచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా... ఎప్పుడు వాటిని వేసుకుందామా అని బడికెళ్ళే రోజుల్లో కలిగిన ఆత్రుత మళ్ళీ ఇన్నేళ్ళకు ఇప్పుడు కలిగింది... ఇన్ని పుస్తకాలు ఒకేసారి దొరికే సరికి... ఏది మొదలు పెడదామా అన్నది మరో సందిగ్ధత!


ఇవే ఈ సారి వచ్చిన కొత్త నేస్తాలు...
ఈ సారి ఎందుకో శతకాల మీదకు మళ్ళింది మనసు. ఎలాగైనా కొన్నైనా కొత్తవి నేర్చుకోవాలని సంకల్పం కలిగింది. అందుకే సుమతీ శతకం, భాస్కర శతకం, కాళహస్తీశ్వర శతకం తీసుకొచ్చాను.

హిమజ్వాల ప్రభామో ఏమో వడ్డెర చండీదాస్ గారి 'చీకట్లోంచి చీకట్లోకి' అప్రయత్నంగా కొనేశాను. 

ఇక రాణి శివశంకర శర్మ గారు రచించిన The Last Brahmin (తెలుగు పుస్తకమే) మరొకటి. ఈ పుస్తకం గురించి చెప్పాల్సింది చాలా ఉంది. తీరిక దొరికితే త్వరలో తప్పకుండా రాస్తాను.


ఫాంటమ్స్ ఇన్ ద బ్రైన్ అనేది ఒక పరిశోధనాత్మక గ్రంథం. ప్రొఫెసర్ రామచంద్రన్ గారు ఆయన వద్దకు వచ్చిన కొన్ని విచిత్రమైన కేసులను ఇందులో చాలా అద్భుతంగా గ్రంధీకరించారు.సౌందర్యలహరి - చాలా కాలం నుండి శ్లోకాలు చదువుతున్నా టీకా తాత్పర్య సహితంగా నేర్చుకోవాలన్న నా కోరిక నెరవేర్చడానికి అమ్మవారే ఇది దొరికేలా చేసింది అనుకుంట. 

30, సెప్టెంబర్ 2012, ఆదివారం

రామచంద్రం భావయామి - ముత్తుస్వామి దీక్షితార్

పల్లవి:
రామచంద్రం భావయామి
రఘుకుల తిలకం ఉపేంద్రం

అనుపల్లవి:
భూమిజా నాయకం భుక్తి ముక్తి దాయకం
నామ కీర్తన తారకం నరవరం గత మాయికం

చరణం:
సాకేత నగరే నివసంతం
సామ్రాజ్య ప్రద హనుమంతం
రాకేందు వదనం భగవంతం
రమణీయ కల్యాణ గుణవంతం

కాకుత్సం ధీమంతం
కమలాక్షం శ్రీమంతం
నాగేశ నుతం అనంతం
నర గురు గుహ విహరంతం


25, సెప్టెంబర్ 2012, మంగళవారం

భక్తి భావన ముఖ్యం!
అద్భుతం కదా..! ముచ్చటేస్తుంది ఈ చిరంజీవులను చూస్తుంటే :)

పిల్లలు అలా తల వంచుకొని వినయంగా శ్లోకాలు నోటికి చదువుతుంటే అందరూ ముక్కు మీద వేలు వేసుకొని చూస్తుండిపోయారు.  చాగంటి కోటేశ్వరరావు గారు అంతటి  వారు సైతం అలా చూస్తుండిపోయారు.

దానికి కారణం తల్లిదండ్రులు. వారి సంస్కారం. వారి పెంపకం!

ఇవి పిల్లలకు నేర్పించాల్సినవి... ఆ శ్రద్ధ మనకెక్కడిది. ఎంత సేపూ దిక్కుమాలిన సినిమా పాటలు వినిపిస్తూ పాడు నాన్న పాడు... అంటే 'పాడు'కాక ఇంకేమవుతారు. ఇవాళ్ళ ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలా శ్లోకాలు, స్తోత్రాలు నేర్పిస్తున్నారు? కనీసం నేర్పించడానికి శ్రద్ధ చూపిస్తున్నారు?

శాస్త్రీయ ధృక్పథానికి ఆధ్యాత్మికత తోడైతే అది అద్భుత ఫలితాలను అందిస్తుంది. స్పోకెన్ ఇంగ్లీషు మీదా, ఐ‌ఐ‌టి కోచింగుల మీదా మనకున్న శ్రద్ధలో ఒకటో వంతు భక్తి మీద కూడా ఉంటే, పిల్లలకూ ఉండేలా చేస్తే వారి భవిష్యత్తు తద్వారా మన భవిష్యత్తు అగమ్యగోచరం అవ్వదు.

మొన్న సాయంకాలం నేను రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వస్తుంటే ఒక ధూర్తుడు ఒక పిల్లాడితో (వాళ్ళబ్బాయేననుకుంట!) వినాయక నవరాత్ర్యోత్సవాల కోసం ఏర్పాటు చేసిన వేదిక మీద దౌర్భాగ్యపు పాటొకటి వేసి నృత్యం చేయిస్తూ కనిపించాడు. ఒళ్ళు మండినంత పనయినా అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్తితి. వీడు ఇలాగైతే ఇంకొకడు ప్రసాదం ఇస్తే పాద రక్షాలు విడవకుండానే ఆరగించేస్తాడు. మళ్ళీ ఆ ధూర్తత్వం బయటకు కనపడనివ్వకుండా కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకుంటాడు. అది పవిత్రమైనదని తెలిస్తే చెప్పులు వదిలి తీసుకోవాలని మాత్రం తెలియదా?

ఎక్కడిది మనకీ కుసంస్కారం? ఎందుకు మనకీ ధూర్తత్వం? లేనిపోని భేషజాలకు పోయి మనకు కీడును తలపెట్టే  అలవాట్లను అంటించుకుంటున్నాం అనిపించట్లేదా?

'కర్తవ్యం దైవమాహ్నికం' అంటారు వేంకటేశ్వర సుప్రభాతంలో. అంటే పని దైవంతో సమానం అని అర్థం. అలాంటి పని (వృత్తి) విషయంలోనూ అంతే... ఈ పూట గడిపేస్తే సరిపోతుందిలే... ఈ సారికి ఇలా కానిచ్చేద్దాం... అనే వైఖరి చాలా చోట్ల దర్శనమిస్తుంది. పని మీద తగినంత భక్తి భావన లేకపోవడమే వీటన్నిటికీ మూల కారణం. ఈ విషయం ఆధునిక శాస్త్రవేత్తల్లో మేటి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి వారిని చదివితే తెలుస్తుంది. "సకల సృష్టికి సంబంధించిన ఎల్లలు లేని వినమ్ర భక్తి భావమే సైన్సులో అన్వేషణకు అసలు ప్రేరకం" అంటారాయన.

ఆ భక్తికి భావనకు, వినమ్రతకూ బీజం పడేది చిన్నప్పుడు పిల్లలకు నేర్పించే వాటిని బట్టి ఉంటుంది. ఆ వయసుకు వారి మనసులో మాట్లాడే నక్కకు, ఎగిరే గుర్రానికీ మహిమ ఎక్కువ. అందుకే చిన్నప్పుడు బామ్మలూ, తాతలూ ఒళ్ళో కూర్చిబెట్టుకొని, భోజనం చేసేటప్పుడూ, నిద్రపోయేటప్పుడూ ఈ కథలు చెప్పేవారు. కథతో పాటు తెలియకుండానే వారికి సమాజంలో వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో తెలిసి సంస్కరింపబడేవారు. ఎప్పుడైతే తాతలూ, బామ్మలూ రామాయణం, భాగవతం వంటివి వదిలేసి టి‌విల దారిన పడ్డారో అప్పుడే ఈ ప్రమత్తత అంకురించింది. ఒకవేళ ఆలోచన ఉన్న వారెవరైనా నేర్పిద్దామన్నా 'పిల్లాడికి ఇప్పుడు ఇవ్వెందుకు నాన్నా వాడు ట్యూషన్ కి వెళ్ళాలి. కాసేపు కార్టూన్స్ చూసుకొనివ్వండి' అని అడ్డు పడే తల్లిదండ్రులు లేకపోలేదు. మనం చదువు'కొనే' పాఠశాలలకు ఇవి నేర్పించే తీరిక ఎలాగూ ఉండదు కనుక మనమే శ్రద్ధ తీసుకొని వాటిని నేర్పించాలి.

సర్వే జనాః సుజనో భవంతు | సర్వే సుజనాః సుఖినో భవంతు ||

1, సెప్టెంబర్ 2012, శనివారం

వీధిన పడ్డ వినాయకుడు!ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ పూజ మొదలు పెట్టినా మొదటి మొక్కు వినాయకుడి హక్కు. 32 రూపాల్లో ఆరాధింపబడే గజాననుడు దైవాల వరుసలో మొదటి వాడు. కార్టూనిస్టులకు ఇష్టమైన దైవం. 'ఓ మై లార్డ్ గణేశా' అని ముద్దు ముద్దు మాటలతో పిల్లలు ప్రీతిగా పాడుకునే దేవుడు. ఆయన ఆకారం ఎంత వింత గొలుపుతుందో, ఆయన కథలు, గాథలూ అంతే విచిత్రంగా ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేక, రాజకీయ, సామాజిక కారణాల వల్ల ఇంకే దేవుడూ పడనంతగా వినాయకుడు వీధినపడ్డాడు!

దాని కథ వాకాటి పాండురంగారావు గారి మాటల్లో - 

వీధిలో మన పని మీద మనం పోతుంటే అటకాయించి చవితి చందాలు వసూలు చేసే హుండీల భక్తులు -
తొమ్మిది రోజులపాటు వాతావరణాన్ని విపరీతమైన శబ్ద కాలుష్యానికి గురిచేసే దిక్కుమాలిన సినిమా పాటలు -
ఆ పందిళ్ళ దగ్గర, ఊరేగింపుల్లో, నిమజ్జనోత్సవాల్లో తిరిగే వాలంటీర్ భటుల ఆర్భాటాలు -
కేజీలు కేజీల లడ్డూల వేలాల పటాటోపాలు -
క్రేనులతో తప్ప పైకెత్తి తీసి అవతల పెట్టలేనంత భారీ సైజు విగ్రహాలు - 

ఈ హడావిడి, హంగామా, ప్రదర్శన పటాటోపం చూస్తే అసలు నిజంగా వ్యక్తికీ విశ్వ చైతన్యానికీ మధ్య సేతువు నిర్మించవలసిన భక్తి అన్నది ఎక్కడో బిక్కచచ్చిపోయి అనాథలాగా సందుల్లో, మూలల్లో నక్కి దాక్కొనడం స్పష్టం కావడంలేదా? ఇందుకు బదులుగా ఊరు ఊరంతా ఒక వేదిక దగ్గర ఏకమైతే, ఒక్క విగ్రహాన్నే పూజిస్తే, ఆ వేదికను సంగీత, నృత్య, నాటకాల సత్కాలక్షేపాల కేంద్రంగా చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది!

ఇలా భారీ విగ్రహాలు పేటకొక్కటి చొప్పున లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తయారు చేసి నీటిలో కలిపే బదులు, చిన్న విగ్రహమే తయారు చేసి మిగితా డబ్బుతో ఈ సమాజంలోని లక్షలాది దరిద్ర నారాయణుల అవసరాలను తీర్చడానికి వినియోగిస్తే భక్తికి సామాజిక ప్రయోజనం జతకుదురుతుంది కదా? 

వాకాటి వారి మాటల్లో చెప్పాలంటే - ఇంట్లో పూజ, బయట సేవ - బహుశా ఈనాటి అవసరం ఇవేనేమో!

అందరూ చెప్పేదే మళ్ళీ మళ్ళీ ఇంకోలా చెప్పడం ఎందుకు? అంటారా?... కనీసం మన కోసం అయినా మనలో మార్పు రావాలని నేను సైతం... ఉడుతా భక్తిగా... అంతే!

3, జూన్ 2012, ఆదివారం

దేవీ ప్రణవశ్లోకీ స్తుతిచేటీ భవన్నిఖిల కేటీ కదంబ వనవాటీషు నాకపటలీ
కోటీర చారుతర కోటీమణీ కిరణ కోటీకరంజిత పదా |
పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీమగాధిపసుతామ్
ఘోటీకులాదధిక ధాటీ ముదారముఖ వీటీర సేనతనుతామ్ || ౧ ||
ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపానధూళిచరణా
పాపాప హస్వ మను జాపానులీన జన తాపాప నోద నిపుణా |
నీపాలయా సురభి ధూపాలకా దురిత కూపాదుదంచయతుమామ్
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ || ౨ ||
యాళీ భిరాత్త తనురాళీ లసత్ప్రియ కపాళీషు ఖేలతి భవా
వ్యాళీనకుల్య సిత చూళీ భరాచరణ ధూళీ లసన్ముణిగణా |
పాళీ భృతిస్రవసితాళీ దళమ్ వహతి యాళీకశోభి తిలకా
సాళీ కరోతు మమ కాళీ మనః స్వపదనాళీకసేవన విధౌ || ౩ ||
బాలామృతాంశు నిభ ఫాలామనా గరుణ చేలానితంబఫలకే
కోలాహలక్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః |
స్థులాకుచే జలద నీలాకచే కలిత లీలాకదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధిరాజ తనయా || ౪ ||
కంబావతీవ సవిడంబాగళేన నవ తుంబాంగ వీణ సవిధా
బింబాధరావినత శంభాయుధాది నికురుంబా కదంబవిపినే |
అంబాకురంగ మద జంబాళరోచి రహలంబాలకా దిశతు మే
శంభాహుళేయ శశిబింబాభిరామముఖ సంభాధితస్తనభరా || ౫ ||
దాసాయమాన సుమహాసా కదంబవనవాసా కుసుంభసుమనో-
వాసా విపంచికృత రాసావిధూయ మధుమాసారవింద మధురా |
కాసారసూనతతి భాసాభిరామ తనురాసార శీత కరుణా
నాసామణి ప్రవరభాసా శివా తిమిరమాసాదయేదుపరతిమ్ || ౬ ||
న్యంకాకరే వపుషి కంకాళరక్తపుషి కంకాదిపక్షివిషయే
త్వంకామనామయసి కింకారణం హృదయ పంకారిమేహి గిరిజామ్ |
శంకాశిలా నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశవక్త్ర కమలామ్ || ౭ ||
జంభారికుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభాకరీంద్ర కరడంబాపహోరుగతి డింభానురంజితపదా |
శంభావుదార పరికంభాంకురత్పుళక డంభానురాగపిసునా
శంభాసురాభరణగుంభా సదాదిశతు శుంభాసురప్రహరణా || ౮ ||
దాక్షాయణీ దనుజశిక్షావిధౌ వికృత దీక్షా మనోహరగుణా
భిక్షాళినో నటనవీక్షావినోదముఖి దక్షాధ్వరప్రహరణా |
వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్షవిముఖీ
యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయలక్ష్మ్యావధానకలనా || ౯ ||
వందారులోకవరసంధాయనీ విమలకుందావదాతరదనా
బృందారబృందమణి బృందారవింద మకరందాభిషిక్తచరణా |
మందానిలాకలిత మందారదామభిర మందాభిరామమకుటా
మందాకినీ జవనబిందానవా చమరవిందాసనా దిశతు మే || ౧౦ ||
యత్రాశయోలగతి తత్రాగజాభవతు కుత్రాపి నిస్తులశుకా
సుత్రామ కాల ముఖ సత్రాసన ప్రకర సుత్రాణ కారి చరణా |
చత్రానిలాతి రయ పత్రాభిరామ గుణమిత్రామరీ సమవధూః
కుత్రాసహీన మణి చిత్రాకృతిస్ఫురిత పుత్రాదిదాననిపుణా || ౧౧ ||
కూలాతిగామి భయ తూలా వళి జ్వలన కీలా నిజ స్తుతి విధా
కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణరతా |
స్థూలా కుచే జలద నీలా కచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజతనయా || ౧౨ ||
ఇంధానకీరమణి బంధా భవే హృదయ బంధావతీవరసికా
సంధావతీ భువన సంధారణేప్యమృత సింధావుదారనిలయా |
గంధానుభావ ముహురంధాళి పీతకచబంధా సమర్పయతు మే
శం ధామ భానుమపిరుంధానమాశు పదసంధానమప్యనుగతా || ౧౩ ||


కాళిదాస విరచిత దేవి ప్రణవ శ్లోకీ స్తుతి అద్భుతమైన సాహిత్యంతో, ఉపమానాలతో సాగే ఈ స్తుతి ఉత్తేజాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించక మానదు.


ఈ స్తుతి నిత్య సంతోషిని గారి గళంలో ఇక్కడ వినొచ్చు...

29, మే 2012, మంగళవారం

విద్యా నభవతి గ్రంథః
చదువు! చదువు!! చదువు!!! 
బడి, కళాశాలలకు వెళ్ళే పిల్లలున్న ఇంట్లో తల్లిదండ్రుల నోటి నుండి తఱచూ వచ్చే వాక్యాలు ఇవి.

మొన్నీ మధ్యన మాటల మధ్యలో ఒకరు చెప్పారు - 'మా బాబుకి ఈ నెలాఖరికి రెండున్నర యేళ్ళు వస్తాయి. ఇంక స్కూల్లో జాయిన్ చేయాలి' అని. 
'అప్పుడేనా?' అని నేనడిగిన ప్రశ్నకు నిర్ఘాంతపోయే సమాధానం చెప్పారు.

ముందే స్కూల్లో చేరిస్తే ఒక సంవత్సరం చదవకపోయినా (డీమోట్ అయినా) సరైన వయసుకి (ప్రభుత్వం వారు నిర్దేశించిన) చదువులు పూర్తవుతాయంట. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కాలంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా కష్ట పాడాలని కూడా హితబోధ చేశారు. 

నాకు ఇప్పటికీ (ఎప్పటికీ) అర్ధం కాని విషయం - ఒక సంవత్సరం ఆలస్యం అయితే వచ్చే నష్టం ఏమిటో?!
ఈ కాలం పిల్లల్ని తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంటుంది. ఎంత సేపూ ఎంసెట్, ఐఐటి లని పోటీలో పాల్గొనే పోట్లగిత్తలుగా తయారు చేయాలనుకుంటున్నారే తప్ప ఈ ప్రెషర్ వల్ల ఆ చిన్నారి హృదయాలకు ఎంత గాయం అవుతుందో పట్టించుకొరేం?

రెండు నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు తమకు తాముగా విషయాలను గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వారిని నర్సరీలనే అసురరీల్లో బంధించకుండా స్వేచ్ఛగా తిరిగనివ్వాలి.  'ఐదో యేట అక్షరాభ్యాసం' అన్న పెద్దల మాట ఎంత సత్యమో అర్ధం అవుతోంది.

విద్యార్ధి అంటే విద్యను అర్ధించేవాడు. కానీ ఈ పోటీ తత్వంతో చదువుకునే వారి సంఖ్య కంటే చదువు'కొనే' వారి సంఖ్య పెరిగిపోయింది.

'విద్య అంటే కేవలం బడిలోని చదువేనా?' అన్న ప్రశ్నకు రాణి శివ శంకర శర్మ గారు వారి పురాణవేదమ్ అనే పుస్తకంలోని ఓ వ్యాసంలో చెప్పిన వాక్యాలను పరిశీలిస్తే సమాధానం గోచరిస్తుంది. అవథరించండి! 


విద్య అంటే చదువు. ఒకప్పుడు వ్రుత్తి. ఉత్పత్తి లో ఒక విభాగం. వ్యవసాయం, వాణిజ్యం, చేపలు పట్టడం, బుట్టలు అల్లడం అన్నీ విద్యలే.
వేదం, విద్య అనే పదాలు ఒకే ధాతువు నుండి పుట్టాయి. రెండింటికీ జ్ఞానం అనే అర్థం ఉంది.
అనంతా వై వేదాః అన్నారు. అంటే వేదం అనంతమైనది, అనిర్వచనీయమైనది అని అర్థం. ఏది వేదం? ఏది విద్య? ధనుర్వేదం అన్నారు, ఆయుర్వేదం అన్నారు - సకల శాస్త్రాలను వేదంగా విద్యగా నిర్వచించారు.

వల్లించడమే కాదు గురి చూడడమూ వేదమే, విద్యే!
నాడిని పట్టడమూ, చికిత్స చేయడమూ వేదమే, విద్యే!

ముఖే ముఖే సరస్వతీ అన్నారు. అంటే ప్రతి ముఖంలోనూ విద్య ఉంది అని అర్థం.
శబ్ద గుణక మాకాశం అన్నారు. శబ్దం అంటే వేదమని అర్థం. అంటే సకల చరాచర జగత్తులో అవ్యక్తంగా వేదం ఉంది, విద్య ఉంది.
వేదానికి కర్త లేడు. విద్యలకి కర్తలు లేరు. స్మర్తలు మాత్రమే ఉన్నారు. అంటే జ్ఞప్తికి తెచ్చుకునేవారు. వారినే ఋషులు అన్నారు. శ్రుతి స్మృతి పురాణాలు గురుముఖతః శిష్య ప్రశిష్య మార్గం ద్వారా ప్రవహిస్తున్నాయి. అలాగే పశుపాలనం, వ్యవసాయం, చేనేతలాంటి విద్యలు గురుకుల పద్ధతిని అనుసరించి కొనసాగుతున్నాయి. అంటే అన్ని కుల వృత్తులూ వేదాలే, విద్యలే.

వాణిజ్యం, పశుపాలన అన్ని వృత్తులూ విద్యలే. ఎవరి విద్య వారికి దైవం. ఆ విద్యే వారికి మేలు చేస్తుంది. అందుకే ఆ విద్యను పూజించాలి.

విద్య అంటే వైవిధ్యభరితమైనది. అసంఖ్యాకమైనది. బహుళమైనది. దానికి ఒకే సిలబస్ లేదు. అది స్థలకాలాలకతీతం. 
కానీ పాశ్చాత్య విద్యా విధానం విద్యని స్థలకాలబద్ధం చేసింది. అందుకే పాశ్చాత్య పరిపాలన మొదలై పాఠశాల వ్యవస్థ ప్రారంభమవడంతోనే విద్య కేంద్రీకృతమైంది.

అంత క్రితం ఉపాధ్యాయుని ఇల్లే  పాఠశాల. గురుకులం అంటే గురువు గారి ఇల్లు అని అర్థం. ఊరే గురువును పోషించేది. అతడు గ్రామంలో ఒక విడదీయరాని భాగం. ఆనాడు గ్రామీణులందరికీ అక్షర జ్ఞానం, గణిత జ్ఞానం తప్పనిసరిగా లభించేవి. 

వలస పాశ్చాత్యులు వచ్చి పాఠశాలలు పెట్టి, సిలబస్ నిర్దేశించి, స్థల కాలాలను క్రమబద్ధం చేసారు. దానితో అక్షరాస్యత క్షీణించింది. గురువు ఉద్యోగిగా మారాడు. అతడు గ్రామంలో భాగం కాదు. పైగా విద్య అంటే ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ అని అర్థం.

పాఠశాల ఒక భవనంలో ఉంటుంది. దానికి నిర్దిష్ట సమయం ఉంటుంది. ఆ సమయంలోనే గురువు గురువుగా వ్యవహరిస్తాడు. పాఠశాల సమయం ముగిసాక అతడు గురువు కాదు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు అంటూ గురువుకి ఇచ్చిన విశాలమైన స్థానం వ్యాపకత్వం చిన్న కంతలోకి కుదించబడింది. 

ఈ విద్యా విధానంలో కుల వృత్తులు విద్యలు కాకుండా పోయాయి. అందుకే ఈ నాడు వ్యవసాయం, చేపలు పట్టడం విద్యలు కావు. అవి ప్రజల అవసరాలతో సంబంధం కలిగి ఉన్నా వాటికి జ్ఞానంగా గుర్తింపు లేదు. కూటి కొరకు కోటి విద్యలు అన్న మాటకి అర్థం మరుగున పడిపోయింది. 
తిండి పెట్టకపోయినా బడిలోనిదే చదువు. ఈ దిక్కుమాలిన చదువులే చివరకు ఆహార సంక్షోభానికి దారి తీస్తున్నాయి.

లేఖనం మాటపై దొరతనం చేయడం అనేది పాశ్చాత్యం తప్ప మరేమీ కాదు. లేఖనం వాక్కును అనుసరిస్తుంది. అది సనాతనం.

అనంత వేదాలు, కోటి విద్యల స్థానంలో విశ్వ విద్యాలయం డిగ్రీలు పట్టాలు వచ్చి చేరాయి. పుస్తకాల్లోనే చదువు ఉందనే అజ్ఞానాన్ని వ్యాపింపజేసాయి.  పరీక్షలు పెరిగి పెరిగి వ్రాతే విద్య అనే అవిద్యని సర్వతోముఖం చేశాయి.

వైదికులు, పశుపాలకులు ఇద్దరికీ చేతిలో పుస్తకం లేదు. కలం లేదు. అయినప్పటికీ ఇద్దరూ విద్యావంతులే. సరస్వతీ పుత్రులే. 
వాక్కు అందరిది ఒకటే కాదు. అందుకే వారి స్థాయి బేధాన్ని బట్టి కులాల్ని బట్టి విద్య ఉంటుంది. పురాణాలు, పాటలు, శృతి స్మృతులు, శాస్త్రాలు ఇలా విద్య చాలా వైవిద్యభరితంగా ఉంది. వేద శాస్త్రాల్లో చెప్పిన సూక్ష్మాలే పురాణాల్లో సులభ బోధకంగా చెప్పేవారు. అందువలనే అన్ని శాస్త్రాలు  అన్ని విషయాలూ అందరికీ స్థాయి బేధంతో అందేవి.

వేదం నభవతి గ్రంథః
విద్యా నభవతి గ్రంథః
సర్వవ్యాపిత్వాత్, శృతి రూపత్వాత్ చ