29, మే 2012, మంగళవారం

విద్యా నభవతి గ్రంథః
చదువు! చదువు!! చదువు!!! 
బడి, కళాశాలలకు వెళ్ళే పిల్లలున్న ఇంట్లో తల్లిదండ్రుల నోటి నుండి తఱచూ వచ్చే వాక్యాలు ఇవి.

మొన్నీ మధ్యన మాటల మధ్యలో ఒకరు చెప్పారు - 'మా బాబుకి ఈ నెలాఖరికి రెండున్నర యేళ్ళు వస్తాయి. ఇంక స్కూల్లో జాయిన్ చేయాలి' అని. 
'అప్పుడేనా?' అని నేనడిగిన ప్రశ్నకు నిర్ఘాంతపోయే సమాధానం చెప్పారు.

ముందే స్కూల్లో చేరిస్తే ఒక సంవత్సరం చదవకపోయినా (డీమోట్ అయినా) సరైన వయసుకి (ప్రభుత్వం వారు నిర్దేశించిన) చదువులు పూర్తవుతాయంట. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కాలంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా కష్ట పాడాలని కూడా హితబోధ చేశారు. 

నాకు ఇప్పటికీ (ఎప్పటికీ) అర్ధం కాని విషయం - ఒక సంవత్సరం ఆలస్యం అయితే వచ్చే నష్టం ఏమిటో?!
ఈ కాలం పిల్లల్ని తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంటుంది. ఎంత సేపూ ఎంసెట్, ఐఐటి లని పోటీలో పాల్గొనే పోట్లగిత్తలుగా తయారు చేయాలనుకుంటున్నారే తప్ప ఈ ప్రెషర్ వల్ల ఆ చిన్నారి హృదయాలకు ఎంత గాయం అవుతుందో పట్టించుకొరేం?

రెండు నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు తమకు తాముగా విషయాలను గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వారిని నర్సరీలనే అసురరీల్లో బంధించకుండా స్వేచ్ఛగా తిరిగనివ్వాలి.  'ఐదో యేట అక్షరాభ్యాసం' అన్న పెద్దల మాట ఎంత సత్యమో అర్ధం అవుతోంది.

విద్యార్ధి అంటే విద్యను అర్ధించేవాడు. కానీ ఈ పోటీ తత్వంతో చదువుకునే వారి సంఖ్య కంటే చదువు'కొనే' వారి సంఖ్య పెరిగిపోయింది.

'విద్య అంటే కేవలం బడిలోని చదువేనా?' అన్న ప్రశ్నకు రాణి శివ శంకర శర్మ గారు వారి పురాణవేదమ్ అనే పుస్తకంలోని ఓ వ్యాసంలో చెప్పిన వాక్యాలను పరిశీలిస్తే సమాధానం గోచరిస్తుంది. అవథరించండి! 


విద్య అంటే చదువు. ఒకప్పుడు వ్రుత్తి. ఉత్పత్తి లో ఒక విభాగం. వ్యవసాయం, వాణిజ్యం, చేపలు పట్టడం, బుట్టలు అల్లడం అన్నీ విద్యలే.
వేదం, విద్య అనే పదాలు ఒకే ధాతువు నుండి పుట్టాయి. రెండింటికీ జ్ఞానం అనే అర్థం ఉంది.
అనంతా వై వేదాః అన్నారు. అంటే వేదం అనంతమైనది, అనిర్వచనీయమైనది అని అర్థం. ఏది వేదం? ఏది విద్య? ధనుర్వేదం అన్నారు, ఆయుర్వేదం అన్నారు - సకల శాస్త్రాలను వేదంగా విద్యగా నిర్వచించారు.

వల్లించడమే కాదు గురి చూడడమూ వేదమే, విద్యే!
నాడిని పట్టడమూ, చికిత్స చేయడమూ వేదమే, విద్యే!

ముఖే ముఖే సరస్వతీ అన్నారు. అంటే ప్రతి ముఖంలోనూ విద్య ఉంది అని అర్థం.
శబ్ద గుణక మాకాశం అన్నారు. శబ్దం అంటే వేదమని అర్థం. అంటే సకల చరాచర జగత్తులో అవ్యక్తంగా వేదం ఉంది, విద్య ఉంది.
వేదానికి కర్త లేడు. విద్యలకి కర్తలు లేరు. స్మర్తలు మాత్రమే ఉన్నారు. అంటే జ్ఞప్తికి తెచ్చుకునేవారు. వారినే ఋషులు అన్నారు. శ్రుతి స్మృతి పురాణాలు గురుముఖతః శిష్య ప్రశిష్య మార్గం ద్వారా ప్రవహిస్తున్నాయి. అలాగే పశుపాలనం, వ్యవసాయం, చేనేతలాంటి విద్యలు గురుకుల పద్ధతిని అనుసరించి కొనసాగుతున్నాయి. అంటే అన్ని కుల వృత్తులూ వేదాలే, విద్యలే.

వాణిజ్యం, పశుపాలన అన్ని వృత్తులూ విద్యలే. ఎవరి విద్య వారికి దైవం. ఆ విద్యే వారికి మేలు చేస్తుంది. అందుకే ఆ విద్యను పూజించాలి.

విద్య అంటే వైవిధ్యభరితమైనది. అసంఖ్యాకమైనది. బహుళమైనది. దానికి ఒకే సిలబస్ లేదు. అది స్థలకాలాలకతీతం. 
కానీ పాశ్చాత్య విద్యా విధానం విద్యని స్థలకాలబద్ధం చేసింది. అందుకే పాశ్చాత్య పరిపాలన మొదలై పాఠశాల వ్యవస్థ ప్రారంభమవడంతోనే విద్య కేంద్రీకృతమైంది.

అంత క్రితం ఉపాధ్యాయుని ఇల్లే  పాఠశాల. గురుకులం అంటే గురువు గారి ఇల్లు అని అర్థం. ఊరే గురువును పోషించేది. అతడు గ్రామంలో ఒక విడదీయరాని భాగం. ఆనాడు గ్రామీణులందరికీ అక్షర జ్ఞానం, గణిత జ్ఞానం తప్పనిసరిగా లభించేవి. 

వలస పాశ్చాత్యులు వచ్చి పాఠశాలలు పెట్టి, సిలబస్ నిర్దేశించి, స్థల కాలాలను క్రమబద్ధం చేసారు. దానితో అక్షరాస్యత క్షీణించింది. గురువు ఉద్యోగిగా మారాడు. అతడు గ్రామంలో భాగం కాదు. పైగా విద్య అంటే ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ అని అర్థం.

పాఠశాల ఒక భవనంలో ఉంటుంది. దానికి నిర్దిష్ట సమయం ఉంటుంది. ఆ సమయంలోనే గురువు గురువుగా వ్యవహరిస్తాడు. పాఠశాల సమయం ముగిసాక అతడు గురువు కాదు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు అంటూ గురువుకి ఇచ్చిన విశాలమైన స్థానం వ్యాపకత్వం చిన్న కంతలోకి కుదించబడింది. 

ఈ విద్యా విధానంలో కుల వృత్తులు విద్యలు కాకుండా పోయాయి. అందుకే ఈ నాడు వ్యవసాయం, చేపలు పట్టడం విద్యలు కావు. అవి ప్రజల అవసరాలతో సంబంధం కలిగి ఉన్నా వాటికి జ్ఞానంగా గుర్తింపు లేదు. కూటి కొరకు కోటి విద్యలు అన్న మాటకి అర్థం మరుగున పడిపోయింది. 
తిండి పెట్టకపోయినా బడిలోనిదే చదువు. ఈ దిక్కుమాలిన చదువులే చివరకు ఆహార సంక్షోభానికి దారి తీస్తున్నాయి.

లేఖనం మాటపై దొరతనం చేయడం అనేది పాశ్చాత్యం తప్ప మరేమీ కాదు. లేఖనం వాక్కును అనుసరిస్తుంది. అది సనాతనం.

అనంత వేదాలు, కోటి విద్యల స్థానంలో విశ్వ విద్యాలయం డిగ్రీలు పట్టాలు వచ్చి చేరాయి. పుస్తకాల్లోనే చదువు ఉందనే అజ్ఞానాన్ని వ్యాపింపజేసాయి.  పరీక్షలు పెరిగి పెరిగి వ్రాతే విద్య అనే అవిద్యని సర్వతోముఖం చేశాయి.

వైదికులు, పశుపాలకులు ఇద్దరికీ చేతిలో పుస్తకం లేదు. కలం లేదు. అయినప్పటికీ ఇద్దరూ విద్యావంతులే. సరస్వతీ పుత్రులే. 
వాక్కు అందరిది ఒకటే కాదు. అందుకే వారి స్థాయి బేధాన్ని బట్టి కులాల్ని బట్టి విద్య ఉంటుంది. పురాణాలు, పాటలు, శృతి స్మృతులు, శాస్త్రాలు ఇలా విద్య చాలా వైవిద్యభరితంగా ఉంది. వేద శాస్త్రాల్లో చెప్పిన సూక్ష్మాలే పురాణాల్లో సులభ బోధకంగా చెప్పేవారు. అందువలనే అన్ని శాస్త్రాలు  అన్ని విషయాలూ అందరికీ స్థాయి బేధంతో అందేవి.

వేదం నభవతి గ్రంథః
విద్యా నభవతి గ్రంథః
సర్వవ్యాపిత్వాత్, శృతి రూపత్వాత్ చ