30, సెప్టెంబర్ 2012, ఆదివారం

రామచంద్రం భావయామి - ముత్తుస్వామి దీక్షితార్

పల్లవి:
రామచంద్రం భావయామి
రఘుకుల తిలకం ఉపేంద్రం

అనుపల్లవి:
భూమిజా నాయకం భుక్తి ముక్తి దాయకం
నామ కీర్తన తారకం నరవరం గత మాయికం

చరణం:
సాకేత నగరే నివసంతం
సామ్రాజ్య ప్రద హనుమంతం
రాకేందు వదనం భగవంతం
రమణీయ కల్యాణ గుణవంతం

కాకుత్సం ధీమంతం
కమలాక్షం శ్రీమంతం
నాగేశ నుతం అనంతం
నర గురు గుహ విహరంతం


25, సెప్టెంబర్ 2012, మంగళవారం

భక్తి భావన ముఖ్యం!
అద్భుతం కదా..! ముచ్చటేస్తుంది ఈ చిరంజీవులను చూస్తుంటే :)

పిల్లలు అలా తల వంచుకొని వినయంగా శ్లోకాలు నోటికి చదువుతుంటే అందరూ ముక్కు మీద వేలు వేసుకొని చూస్తుండిపోయారు.  చాగంటి కోటేశ్వరరావు గారు అంతటి  వారు సైతం అలా చూస్తుండిపోయారు.

దానికి కారణం తల్లిదండ్రులు. వారి సంస్కారం. వారి పెంపకం!

ఇవి పిల్లలకు నేర్పించాల్సినవి... ఆ శ్రద్ధ మనకెక్కడిది. ఎంత సేపూ దిక్కుమాలిన సినిమా పాటలు వినిపిస్తూ పాడు నాన్న పాడు... అంటే 'పాడు'కాక ఇంకేమవుతారు. ఇవాళ్ళ ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలా శ్లోకాలు, స్తోత్రాలు నేర్పిస్తున్నారు? కనీసం నేర్పించడానికి శ్రద్ధ చూపిస్తున్నారు?

శాస్త్రీయ ధృక్పథానికి ఆధ్యాత్మికత తోడైతే అది అద్భుత ఫలితాలను అందిస్తుంది. స్పోకెన్ ఇంగ్లీషు మీదా, ఐ‌ఐ‌టి కోచింగుల మీదా మనకున్న శ్రద్ధలో ఒకటో వంతు భక్తి మీద కూడా ఉంటే, పిల్లలకూ ఉండేలా చేస్తే వారి భవిష్యత్తు తద్వారా మన భవిష్యత్తు అగమ్యగోచరం అవ్వదు.

మొన్న సాయంకాలం నేను రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వస్తుంటే ఒక ధూర్తుడు ఒక పిల్లాడితో (వాళ్ళబ్బాయేననుకుంట!) వినాయక నవరాత్ర్యోత్సవాల కోసం ఏర్పాటు చేసిన వేదిక మీద దౌర్భాగ్యపు పాటొకటి వేసి నృత్యం చేయిస్తూ కనిపించాడు. ఒళ్ళు మండినంత పనయినా అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్తితి. వీడు ఇలాగైతే ఇంకొకడు ప్రసాదం ఇస్తే పాద రక్షాలు విడవకుండానే ఆరగించేస్తాడు. మళ్ళీ ఆ ధూర్తత్వం బయటకు కనపడనివ్వకుండా కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకుంటాడు. అది పవిత్రమైనదని తెలిస్తే చెప్పులు వదిలి తీసుకోవాలని మాత్రం తెలియదా?

ఎక్కడిది మనకీ కుసంస్కారం? ఎందుకు మనకీ ధూర్తత్వం? లేనిపోని భేషజాలకు పోయి మనకు కీడును తలపెట్టే  అలవాట్లను అంటించుకుంటున్నాం అనిపించట్లేదా?

'కర్తవ్యం దైవమాహ్నికం' అంటారు వేంకటేశ్వర సుప్రభాతంలో. అంటే పని దైవంతో సమానం అని అర్థం. అలాంటి పని (వృత్తి) విషయంలోనూ అంతే... ఈ పూట గడిపేస్తే సరిపోతుందిలే... ఈ సారికి ఇలా కానిచ్చేద్దాం... అనే వైఖరి చాలా చోట్ల దర్శనమిస్తుంది. పని మీద తగినంత భక్తి భావన లేకపోవడమే వీటన్నిటికీ మూల కారణం. ఈ విషయం ఆధునిక శాస్త్రవేత్తల్లో మేటి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి వారిని చదివితే తెలుస్తుంది. "సకల సృష్టికి సంబంధించిన ఎల్లలు లేని వినమ్ర భక్తి భావమే సైన్సులో అన్వేషణకు అసలు ప్రేరకం" అంటారాయన.

ఆ భక్తికి భావనకు, వినమ్రతకూ బీజం పడేది చిన్నప్పుడు పిల్లలకు నేర్పించే వాటిని బట్టి ఉంటుంది. ఆ వయసుకు వారి మనసులో మాట్లాడే నక్కకు, ఎగిరే గుర్రానికీ మహిమ ఎక్కువ. అందుకే చిన్నప్పుడు బామ్మలూ, తాతలూ ఒళ్ళో కూర్చిబెట్టుకొని, భోజనం చేసేటప్పుడూ, నిద్రపోయేటప్పుడూ ఈ కథలు చెప్పేవారు. కథతో పాటు తెలియకుండానే వారికి సమాజంలో వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో తెలిసి సంస్కరింపబడేవారు. ఎప్పుడైతే తాతలూ, బామ్మలూ రామాయణం, భాగవతం వంటివి వదిలేసి టి‌విల దారిన పడ్డారో అప్పుడే ఈ ప్రమత్తత అంకురించింది. ఒకవేళ ఆలోచన ఉన్న వారెవరైనా నేర్పిద్దామన్నా 'పిల్లాడికి ఇప్పుడు ఇవ్వెందుకు నాన్నా వాడు ట్యూషన్ కి వెళ్ళాలి. కాసేపు కార్టూన్స్ చూసుకొనివ్వండి' అని అడ్డు పడే తల్లిదండ్రులు లేకపోలేదు. మనం చదువు'కొనే' పాఠశాలలకు ఇవి నేర్పించే తీరిక ఎలాగూ ఉండదు కనుక మనమే శ్రద్ధ తీసుకొని వాటిని నేర్పించాలి.

సర్వే జనాః సుజనో భవంతు | సర్వే సుజనాః సుఖినో భవంతు ||

1, సెప్టెంబర్ 2012, శనివారం

వీధిన పడ్డ వినాయకుడు!ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ పూజ మొదలు పెట్టినా మొదటి మొక్కు వినాయకుడి హక్కు. 32 రూపాల్లో ఆరాధింపబడే గజాననుడు దైవాల వరుసలో మొదటి వాడు. కార్టూనిస్టులకు ఇష్టమైన దైవం. 'ఓ మై లార్డ్ గణేశా' అని ముద్దు ముద్దు మాటలతో పిల్లలు ప్రీతిగా పాడుకునే దేవుడు. ఆయన ఆకారం ఎంత వింత గొలుపుతుందో, ఆయన కథలు, గాథలూ అంతే విచిత్రంగా ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేక, రాజకీయ, సామాజిక కారణాల వల్ల ఇంకే దేవుడూ పడనంతగా వినాయకుడు వీధినపడ్డాడు!

దాని కథ వాకాటి పాండురంగారావు గారి మాటల్లో - 

వీధిలో మన పని మీద మనం పోతుంటే అటకాయించి చవితి చందాలు వసూలు చేసే హుండీల భక్తులు -
తొమ్మిది రోజులపాటు వాతావరణాన్ని విపరీతమైన శబ్ద కాలుష్యానికి గురిచేసే దిక్కుమాలిన సినిమా పాటలు -
ఆ పందిళ్ళ దగ్గర, ఊరేగింపుల్లో, నిమజ్జనోత్సవాల్లో తిరిగే వాలంటీర్ భటుల ఆర్భాటాలు -
కేజీలు కేజీల లడ్డూల వేలాల పటాటోపాలు -
క్రేనులతో తప్ప పైకెత్తి తీసి అవతల పెట్టలేనంత భారీ సైజు విగ్రహాలు - 

ఈ హడావిడి, హంగామా, ప్రదర్శన పటాటోపం చూస్తే అసలు నిజంగా వ్యక్తికీ విశ్వ చైతన్యానికీ మధ్య సేతువు నిర్మించవలసిన భక్తి అన్నది ఎక్కడో బిక్కచచ్చిపోయి అనాథలాగా సందుల్లో, మూలల్లో నక్కి దాక్కొనడం స్పష్టం కావడంలేదా? ఇందుకు బదులుగా ఊరు ఊరంతా ఒక వేదిక దగ్గర ఏకమైతే, ఒక్క విగ్రహాన్నే పూజిస్తే, ఆ వేదికను సంగీత, నృత్య, నాటకాల సత్కాలక్షేపాల కేంద్రంగా చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది!

ఇలా భారీ విగ్రహాలు పేటకొక్కటి చొప్పున లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తయారు చేసి నీటిలో కలిపే బదులు, చిన్న విగ్రహమే తయారు చేసి మిగితా డబ్బుతో ఈ సమాజంలోని లక్షలాది దరిద్ర నారాయణుల అవసరాలను తీర్చడానికి వినియోగిస్తే భక్తికి సామాజిక ప్రయోజనం జతకుదురుతుంది కదా? 

వాకాటి వారి మాటల్లో చెప్పాలంటే - ఇంట్లో పూజ, బయట సేవ - బహుశా ఈనాటి అవసరం ఇవేనేమో!

అందరూ చెప్పేదే మళ్ళీ మళ్ళీ ఇంకోలా చెప్పడం ఎందుకు? అంటారా?... కనీసం మన కోసం అయినా మనలో మార్పు రావాలని నేను సైతం... ఉడుతా భక్తిగా... అంతే!