21, డిసెంబర్ 2013, శనివారం

శ్రీ దేవీ నవరత్న మాలికా స్తోత్రము

హారనూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం
కారణేశ వరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికామ్
కాలకాల ఫణి పాశబాణ ధనురంకుశామరుణ మేఖలాం
ఫాలభూతిలక లోచనాం మనసి భావయామి పరదేవతామ్

గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీమ్
సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితామ్
మంథరా యతవిలోచనా మమల బాలచంద్ర కృతశేఖరామ్
ఇందిరా రమణ సోదరీం మనసి భావయామి పరదేవాతామ్

స్మేర చారుముఖమండలాం విమలగండలంబి మణిమండలాం
హారదామ పరిశోభామాన కుచభారభీరు తనుమధ్యమామ్
వీరగర్వహర నూపురాం వివిధకారణేశవరపీఠికాం
మార వైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతామ్

భూరిభారధర కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం
వారిరాశి మణిమేఖలావలయ వహ్నిమండలశరీరిణీమ్
వారి సారవహ కుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్రరవిలోచనాం మనసి భావయామి పరదేవతామ్

కుండల త్రివిధకోణ మండల విహార షడ్డల సముల్లస
 పుండరీక ముఖభేదినీం తరుణ చండ భాను తడిదుజ్జ్వలామ్
మండలేందు పరివాహితామృత తరంగిణీ మరుణ రూపిణీం
మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్

వారణానన మయూర వాహముఖ దాహవారణ పయోధరాం
చారణా ది సుర సుందరీ చికుర శేఖరీకృత పదాంబుజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రధమ మాతృకాం
వారణాంత ముఖ పారణాం మనసి భావయామి పరదేవతామ్

పద్మకాంతి పదపాణిపల్లవ పయోధరానన సరోరుహాం
పద్మరాగ మణిమేఖలా వలయనీ విశోభిత నితంబినీమ్
పద్మసంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం
పద్మినీం ప్రణవ రూపిణీం మనసి భావయామి పరదేవతామ్

ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణమంగళ శరీరిణీం
ఆగమావయవ శోభినీమఖిల వేదసారకృతశేఖరీమ్
మూలమంత్ర ముఖమండలాం ముదితనాదబిందు నవయౌవనాం
మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతామ్

కాలికా తిమిర కుంతలాంత ఘనభృంగమంగళ విరాజినీం
చూలికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం
బాలికా మధుర గండమండల మనోహరానన సరోరుహాం
కాలికా మఖిల నాయికాం మనసి భావయామి పరదేవతామ్

ఫలశ్రుతి:
నిత్యమేవ నియమేన జల్పతాం
భుక్తి ముక్తి ఫలదామాభీష్టదాం
శంకరేణ రచితాం సదా జపే
నామరత్న నవరత్నమాలికామ్

20, డిసెంబర్ 2013, శుక్రవారం

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి


ముందుగా కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

ఔపోశనము ( భోజనమునకు ముందు )

ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.

అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.
తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.

సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని

ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః

అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని
అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.

కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.

ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.

మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.

తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను.

ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.

రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.

తతః శత పదాని గత్వా - వంద అడుగులు వేయవలెను. తరువాత

అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయంత్వశేషమ్.
సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ త్వరోగోర మమచాస్తు దేహః.

అంటూ పొట్టను ముమ్మారు నిమర వలయును. తద్వారా ఆహారము చక్కగా జీర్ణమగును.

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

రామ లాలి మేఘ శ్యామ లాలీ

రామ లాలి మేఘ శ్యామ లాలీ తామ రసన నయన దశరధ తనయ లాలి
అచ్చ వదన ఆటలాడి అలసినావు రా... బొజ్జలోపల అరిగెదాక నిదుర పోవరా
రామ లాలీ... రామ లాలీ... రామ లాలీ... రామ లాలీ...
జోల పాడి జో కొట్టితే ఆలకించెవు... చాలించ మరి ఊరకుంటే సంజ్ఞ చేసేవు
రామ లాలీ... రామ లాలీ... రామ లాలీ... రామ లాలీ...
ఎంతో ఎత్తు మరగినావు ఏమి సేతురా...  ఇంతుల చేతుల కకలకు ఎంతో కందేవు
ఈ పాటకు చాలా సాహిత్యాలు ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని ఇక్కడ ఉంచుతున్నాను. 


ప్రయాగ రామకృష్ణ గారి 'తెలుగు పల్లె పాటలు' సంకలనం నుండి... 

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయా లాలీ రామలాలీ...

అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలో పాలరుగుగాని నిదురపోవరా రామలాలీ...

జోలలుబాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించి మరి యూరకుంటే సౌజ్ఞ చేసేవూ రామలాలీ...

ఎంతోయెత్తు మరిగినావు ఏమిసేతురా
వింతగాని కొండ నుండు వీరరాఘవా రామలాలీ...ఆర్. కమల గారి 'లాలి పాటలు' సంకలనం నుండి...


రామలాలీ మేఘశ్యామలాలీ తామరస నయన దశరథ తనయా లాలీ
శ్రీరామ లోకనాయక శేషశయన నారాయణాచ్యుతా స్వామీ నను
కన్నతండ్రీ రామలాలీ...
చిన్ని ముద్దుల నాయనా చిన్ని కృష్ణమ్మ నాయన్నా రారా
నీకు స్తన్య పానమిచ్చెదను వెన్నపాలు నెయ్యి ఉగ్గు నీవు తిన్నగ
సేవించవయ్యా రామలాలీ...
సంపంగి నూనె తలంటి స్వామితో యింపు తోడుగ చుంచుదువ్వి
కర్పూర ధూప దీపములొసగేను అబ్బబ్బ నిదుర పొమ్మీ అచ్యుతా
రామలాలీ రామలాలీ...
అద్దాల తొట్టి నీవు ముద్దు పాపడున్నాడనుచు మురసి చూసేవు
సద్దుచేసి లెమ్మనుచు సంజ్ఞ చేసేవు దగ్గరకు రమ్మంటు తగలు
పోయేవు రామలాలీ...
గజ్జెలు అందెలు ఘల్లు ఘల్లు మని మ్రోయ
ఝంఝం తకిటయని తాళగతులు శంకలేక రామలాలీ...
నీ యింపు చెలగిచూసే లక్ష్మణుని  పొల్లుగ చూచేవురా రామలాలీ...


భాగ్యలక్ష్మి చిత్రం నుండి

 
గాయకులు: టంగుటూరి సూర్యకుమారి
రచన: సముద్రాల వేంకట రాఘవాచార్య
సంగీత దర్శకులు: భీమవరపు నరసింహారావు


http://bit.ly/16aclCd నుండి
రాగం: మధ్యమావతి ।  తాళం: ఆది 
రామ లాలి మేఘ శ్యామ లాలి తామరస నయన రాజ తనయ లాలి
అద్దంపు తొట్లెలో నేమో అనుమానించెదవు ముద్దు పాపడున్నాని ముఖము జూపెదవు
శంఖ లోక బూచియంటే చెలగి నవ్వెదవు పొంకముతో సౌమిత్రిని పొసగుతు లేపెదవు
అబ్జవదన ఆటలాడి అలసినావుర బొజ్జలో పాలరుగగ నిదురబోవు నిమిశము
ఎంతో ఎత్తు మరగినావు ఏమి సేయుదురా ఇంతుల చేతుల కాకల నీ మేనెంతో కందినదే
జోల బాడి జో కొట్టితే అలకించెదవు సాలించితే ఉంగొట్టుచు సంజ్ఞలు జేసేవు
అన్నిటికి మూలమైన ఆది విష్ణువు సంతతము భద్రగిరి స్వామి రాఘవఇంకో సాహిత్యం...

రామాలాలీ మేఘ శ్యామా లాలీ రామా
రామరాజ్యమైన దశరథ తనయాలాలీ

ఎంత ఎత్తు ఎదిగినావో.. ఏమి చేయుదుమో రామా
అందరి కన్నుల ముందర.. నీవు ముద్దుగ తిరిగేవో రామా

అయోధ్య నగరమంతా.. అలంకరించేమో రామా
నీవు నడిచే బాటల్లోన.. మల్లెలు చల్లేమో

అడ్డమైన ఆటలు... ఆడి అలసిపోతివో రామా
జో కొట్టి జోలలు... పాడి నిద్దురపుచ్చేమో రామా

బంగారు పట్టు... శాలువ పైన కప్పేమో రామా
జోకొట్టి జోలలుపాడి.. నిద్దురపుచ్చేమో రామా

5, సెప్టెంబర్ 2013, గురువారం

​​శ్రీ ​గురుభ్యోనమః​

మనిషి తన నుండి తానూ ఏ మేరకు విముక్తి చెందడానికి వాంఛిస్తున్నాడో, ప్రయత్నిస్తున్నాడో, సాధిస్తున్నాడో ఆ మేరకే అతడు మానవుడు - అంటారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అలా చేయని వాడు తోకలేని, కొమ్ములు లేని పశువు. ఇంతకీ ఈ 'తన' తనం ఏంటి? అది అవిద్య, చీకటి, మరణం. ​ అక్కడి నుండి విద్యకు, వెలుగుకు, అమృతత్వానికి ప్రస్థానమే అతని జీవితం.
అందుకే - ​ 
అసతోమా సద్గమయ 
తమసోమా జ్యోతిర్గమయ 
మృత్యోర్మా అమృతంగమయ ​ 
అని రోజూ ప్రార్థిస్తాము, పిల్లతో చెప్పిస్తాము. ఇది భారత జాతిని అనాదిగా ప్రేరేపించిన ఆశయం. ఆ యత్నమే అయిదారువేల సంవత్సరాల కాలపు ధాటికి తట్టుకొని నిలబడగలిగిన అపూర్వమైన మన ప్రాచీన వాజ్ఞ్మయం. మరి ఇంత సాహిత్యం, అంత గొప్ప ఆశయమూ ఉండి మన వాళ్ళిలా ఎందుకు ఉన్నారు? వ్యక్తుల సమిష్టి రూపమే సమాజం. ప్రతి వ్యక్తీ ఈ ఆశయాలతో ప్రేరేపితుడై తనను తాను ఆంతరంగికంగా, బహిర్ముఖంగా శుభ్రంగా ఉంచుకోనిదే సమాజం మారదు. వ్యక్తులు మారితేనే సమాజం మారుతుంది. అది తెలిసిన జాతి అలాంటి మహత్కార్యం కోసం నిర్మించిన వ్యవస్థకు ఏకవచనమే 'గురువు' - అంటారు వాకాటి పాండురంగారావు గారు తమ 'మిత్రవాక్యం'లో.
'గు' కారస్త్యంధ కారస్య 'రు' కార్యస్య తన్నివర్తకః అని గురు శబ్దార్థం. భారత జాతి ప్రపంచానికి ఇచ్చిన అనేకానేక వరాల్లో ఒకటి ఈ గురు-శిష్య పరంపర. మనుషులందరికీ మార్గదర్శకమైన రామాయణం మొదలయ్యేది గురు సుశ్రూషతోనే. ఒక వివేకానందుడి లాంటి వ్యక్తిత్వం తయారయ్యిందంటే అది కేవలం రామకృష్ణ పరమహంస లాంటి గురువు వల్లనే. గురు శిష్యుల సంబంధం తల్లీ - బిడ్డల సంబంధం లాంటిది. తండ్రీ - కొడుల బంధం లాంటిది. లెక్చరర్ల మీద జోకులు వేయడం అనేది గొప్ప పనిగా అనుకునే - నేటి మనం అర్థం చేసుకోలేనంత ఉన్నతమైన బాంధవ్యం.
"నువ్వెవరివో నీకు తెలియజెప్పేవాడే గురువు. ఆ అసలైన నువ్వుగా మారడానికి దోహదం చేసేవాడే గురువు" అన్నది శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి నిర్వచనం. 
"అందరు విద్యార్థులను వారి విద్యాభ్యాస కాలంలో ఒక్క సంవత్సరం అయినా ఈ సిలబస్సులు, పరీక్షలు లాంటివి లేని నిజమైన ​గురుకుల వాసంలో ఉండనివ్వండి. వినయము, శీలము, క్రమశిక్షణ అలవడతాయి" అనేవారు స్వామి. నేటి సమాజంలో కొరవడినవి అవే కదా! 
సంతః పరీక్ష్య అన్యతరాత్ భజంతే 
మూఢః పరప్రత్యనేయ బుద్ధిః 
వివేకవంతులు పరీక్షించి నిశ్చయించుకుంటారు. మూఢులు ఇతరులు చెప్పిన దాన్నే నమ్ముతారు. 
విద్యార్థుల్లో బట్టికొట్టే విధానాన్ని, ఉన్నది ఉన్నట్టు చదివే విధానాన్ని మాన్పించి ఈ అలవాటును పెంపొందిస్తే వారు స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు అని ఇది రాసే వాడి అభిప్రాయం. అదే వివేకానందుల అభిమతం కూడానూ.
ప్రత్యక్షంగానే కాదు వారి ఆలోచనలతో, మాటలతో, వ్రాతలతో ఆలోచనా సరళిని మెరుగు పరచే వారూ గురువులు అనడంలో అతిశయం లేదు.
నా మీద, నాలాంటి ఎందరి శిష్యుల మీదో తమ దయను ప్రసరింపజేసి వారిని సన్మార్గం వైపు నడిపించేవారు... భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, జిడ్డు కృష్ణ మూర్తి గారు, వాకాటి పాండురంగారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు... ఇలా చెబుతూ పోతే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వీరందరి పాదాలకు శిరస్సు తాటించి పాదాభివందనం చేస్తూ...
। మంగళం మహత్ ।