15, సెప్టెంబర్ 2013, ఆదివారం

రామ లాలి మేఘ శ్యామ లాలీ

రామ లాలి మేఘ శ్యామ లాలీ తామ రసన నయన దశరధ తనయ లాలి
అచ్చ వదన ఆటలాడి అలసినావు రా... బొజ్జలోపల అరిగెదాక నిదుర పోవరా
రామ లాలీ... రామ లాలీ... రామ లాలీ... రామ లాలీ...
జోల పాడి జో కొట్టితే ఆలకించెవు... చాలించ మరి ఊరకుంటే సంజ్ఞ చేసేవు
రామ లాలీ... రామ లాలీ... రామ లాలీ... రామ లాలీ...
ఎంతో ఎత్తు మరగినావు ఏమి సేతురా...  ఇంతుల చేతుల కకలకు ఎంతో కందేవు
ఈ పాటకు చాలా సాహిత్యాలు ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని ఇక్కడ ఉంచుతున్నాను. 


ప్రయాగ రామకృష్ణ గారి 'తెలుగు పల్లె పాటలు' సంకలనం నుండి... 

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయా లాలీ రామలాలీ...

అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలో పాలరుగుగాని నిదురపోవరా రామలాలీ...

జోలలుబాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించి మరి యూరకుంటే సౌజ్ఞ చేసేవూ రామలాలీ...

ఎంతోయెత్తు మరిగినావు ఏమిసేతురా
వింతగాని కొండ నుండు వీరరాఘవా రామలాలీ...ఆర్. కమల గారి 'లాలి పాటలు' సంకలనం నుండి...


రామలాలీ మేఘశ్యామలాలీ తామరస నయన దశరథ తనయా లాలీ
శ్రీరామ లోకనాయక శేషశయన నారాయణాచ్యుతా స్వామీ నను
కన్నతండ్రీ రామలాలీ...
చిన్ని ముద్దుల నాయనా చిన్ని కృష్ణమ్మ నాయన్నా రారా
నీకు స్తన్య పానమిచ్చెదను వెన్నపాలు నెయ్యి ఉగ్గు నీవు తిన్నగ
సేవించవయ్యా రామలాలీ...
సంపంగి నూనె తలంటి స్వామితో యింపు తోడుగ చుంచుదువ్వి
కర్పూర ధూప దీపములొసగేను అబ్బబ్బ నిదుర పొమ్మీ అచ్యుతా
రామలాలీ రామలాలీ...
అద్దాల తొట్టి నీవు ముద్దు పాపడున్నాడనుచు మురసి చూసేవు
సద్దుచేసి లెమ్మనుచు సంజ్ఞ చేసేవు దగ్గరకు రమ్మంటు తగలు
పోయేవు రామలాలీ...
గజ్జెలు అందెలు ఘల్లు ఘల్లు మని మ్రోయ
ఝంఝం తకిటయని తాళగతులు శంకలేక రామలాలీ...
నీ యింపు చెలగిచూసే లక్ష్మణుని  పొల్లుగ చూచేవురా రామలాలీ...


భాగ్యలక్ష్మి చిత్రం నుండి

 
గాయకులు: టంగుటూరి సూర్యకుమారి
రచన: సముద్రాల వేంకట రాఘవాచార్య
సంగీత దర్శకులు: భీమవరపు నరసింహారావు


http://bit.ly/16aclCd నుండి
రాగం: మధ్యమావతి ।  తాళం: ఆది 
రామ లాలి మేఘ శ్యామ లాలి తామరస నయన రాజ తనయ లాలి
అద్దంపు తొట్లెలో నేమో అనుమానించెదవు ముద్దు పాపడున్నాని ముఖము జూపెదవు
శంఖ లోక బూచియంటే చెలగి నవ్వెదవు పొంకముతో సౌమిత్రిని పొసగుతు లేపెదవు
అబ్జవదన ఆటలాడి అలసినావుర బొజ్జలో పాలరుగగ నిదురబోవు నిమిశము
ఎంతో ఎత్తు మరగినావు ఏమి సేయుదురా ఇంతుల చేతుల కాకల నీ మేనెంతో కందినదే
జోల బాడి జో కొట్టితే అలకించెదవు సాలించితే ఉంగొట్టుచు సంజ్ఞలు జేసేవు
అన్నిటికి మూలమైన ఆది విష్ణువు సంతతము భద్రగిరి స్వామి రాఘవఇంకో సాహిత్యం...

రామాలాలీ మేఘ శ్యామా లాలీ రామా
రామరాజ్యమైన దశరథ తనయాలాలీ

ఎంత ఎత్తు ఎదిగినావో.. ఏమి చేయుదుమో రామా
అందరి కన్నుల ముందర.. నీవు ముద్దుగ తిరిగేవో రామా

అయోధ్య నగరమంతా.. అలంకరించేమో రామా
నీవు నడిచే బాటల్లోన.. మల్లెలు చల్లేమో

అడ్డమైన ఆటలు... ఆడి అలసిపోతివో రామా
జో కొట్టి జోలలు... పాడి నిద్దురపుచ్చేమో రామా

బంగారు పట్టు... శాలువ పైన కప్పేమో రామా
జోకొట్టి జోలలుపాడి.. నిద్దురపుచ్చేమో రామా

5, సెప్టెంబర్ 2013, గురువారం

​​శ్రీ ​గురుభ్యోనమః​

మనిషి తన నుండి తానూ ఏ మేరకు విముక్తి చెందడానికి వాంఛిస్తున్నాడో, ప్రయత్నిస్తున్నాడో, సాధిస్తున్నాడో ఆ మేరకే అతడు మానవుడు - అంటారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అలా చేయని వాడు తోకలేని, కొమ్ములు లేని పశువు. ఇంతకీ ఈ 'తన' తనం ఏంటి? అది అవిద్య, చీకటి, మరణం. ​ అక్కడి నుండి విద్యకు, వెలుగుకు, అమృతత్వానికి ప్రస్థానమే అతని జీవితం.
అందుకే - ​ 
అసతోమా సద్గమయ 
తమసోమా జ్యోతిర్గమయ 
మృత్యోర్మా అమృతంగమయ ​ 
అని రోజూ ప్రార్థిస్తాము, పిల్లతో చెప్పిస్తాము. ఇది భారత జాతిని అనాదిగా ప్రేరేపించిన ఆశయం. ఆ యత్నమే అయిదారువేల సంవత్సరాల కాలపు ధాటికి తట్టుకొని నిలబడగలిగిన అపూర్వమైన మన ప్రాచీన వాజ్ఞ్మయం. మరి ఇంత సాహిత్యం, అంత గొప్ప ఆశయమూ ఉండి మన వాళ్ళిలా ఎందుకు ఉన్నారు? వ్యక్తుల సమిష్టి రూపమే సమాజం. ప్రతి వ్యక్తీ ఈ ఆశయాలతో ప్రేరేపితుడై తనను తాను ఆంతరంగికంగా, బహిర్ముఖంగా శుభ్రంగా ఉంచుకోనిదే సమాజం మారదు. వ్యక్తులు మారితేనే సమాజం మారుతుంది. అది తెలిసిన జాతి అలాంటి మహత్కార్యం కోసం నిర్మించిన వ్యవస్థకు ఏకవచనమే 'గురువు' - అంటారు వాకాటి పాండురంగారావు గారు తమ 'మిత్రవాక్యం'లో.
'గు' కారస్త్యంధ కారస్య 'రు' కార్యస్య తన్నివర్తకః అని గురు శబ్దార్థం. భారత జాతి ప్రపంచానికి ఇచ్చిన అనేకానేక వరాల్లో ఒకటి ఈ గురు-శిష్య పరంపర. మనుషులందరికీ మార్గదర్శకమైన రామాయణం మొదలయ్యేది గురు సుశ్రూషతోనే. ఒక వివేకానందుడి లాంటి వ్యక్తిత్వం తయారయ్యిందంటే అది కేవలం రామకృష్ణ పరమహంస లాంటి గురువు వల్లనే. గురు శిష్యుల సంబంధం తల్లీ - బిడ్డల సంబంధం లాంటిది. తండ్రీ - కొడుల బంధం లాంటిది. లెక్చరర్ల మీద జోకులు వేయడం అనేది గొప్ప పనిగా అనుకునే - నేటి మనం అర్థం చేసుకోలేనంత ఉన్నతమైన బాంధవ్యం.
"నువ్వెవరివో నీకు తెలియజెప్పేవాడే గురువు. ఆ అసలైన నువ్వుగా మారడానికి దోహదం చేసేవాడే గురువు" అన్నది శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి నిర్వచనం. 
"అందరు విద్యార్థులను వారి విద్యాభ్యాస కాలంలో ఒక్క సంవత్సరం అయినా ఈ సిలబస్సులు, పరీక్షలు లాంటివి లేని నిజమైన ​గురుకుల వాసంలో ఉండనివ్వండి. వినయము, శీలము, క్రమశిక్షణ అలవడతాయి" అనేవారు స్వామి. నేటి సమాజంలో కొరవడినవి అవే కదా! 
సంతః పరీక్ష్య అన్యతరాత్ భజంతే 
మూఢః పరప్రత్యనేయ బుద్ధిః 
వివేకవంతులు పరీక్షించి నిశ్చయించుకుంటారు. మూఢులు ఇతరులు చెప్పిన దాన్నే నమ్ముతారు. 
విద్యార్థుల్లో బట్టికొట్టే విధానాన్ని, ఉన్నది ఉన్నట్టు చదివే విధానాన్ని మాన్పించి ఈ అలవాటును పెంపొందిస్తే వారు స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు అని ఇది రాసే వాడి అభిప్రాయం. అదే వివేకానందుల అభిమతం కూడానూ.
ప్రత్యక్షంగానే కాదు వారి ఆలోచనలతో, మాటలతో, వ్రాతలతో ఆలోచనా సరళిని మెరుగు పరచే వారూ గురువులు అనడంలో అతిశయం లేదు.
నా మీద, నాలాంటి ఎందరి శిష్యుల మీదో తమ దయను ప్రసరింపజేసి వారిని సన్మార్గం వైపు నడిపించేవారు... భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, జిడ్డు కృష్ణ మూర్తి గారు, వాకాటి పాండురంగారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు... ఇలా చెబుతూ పోతే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వీరందరి పాదాలకు శిరస్సు తాటించి పాదాభివందనం చేస్తూ...
। మంగళం మహత్ ।