15, జనవరి 2014, బుధవారం

శరణాగతి తత్వం

ఆది శంకరాచార్య విరచిత శివానందలహరిలోని ఈ శ్లోకం భక్తి అంటే ఎలా ఉండాలో వివరిస్తుంది. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్లోకాల్లో ఒకటి.

అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోపలం సూచికా
స్వాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు స్సరిద్వల్లభమ్
ప్రాప్నో తీహ యథా తథా పశుపతేః పదారవింద ద్వయం
చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ॥


ఊడుగు చెట్టు నుండి రాలిన విత్తనాలు ఎలాగైతే వాటికవే ఆ చెట్టును అంటుకుపోతయో, సూది ఎలాగైతే అయస్కాంతానికి అంటుకుంటుందో, పతివ్రత ఎలాగైతే తన పతిని అంటిపెట్టుకొని ఉంటుందో, తీగ ఎలాగైతే దానికదే చెట్టును అల్లుకుపోతుందో, నదులు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలాగైతే సముద్రంలో సంగమిస్తాయో అలా నా చిత్తవృత్తి ఎటూ మరలకుండా పరమేశ్వరుని పాదపద్మముల మీదే లగ్నం అయి ఉంటుంది. అదే భక్తి అనిపించుకుంటుంది.

మనసుకు తెలియకుండానే ఈశ్వరునితో ఐక్యం అవ్వాలి. ఒక్క క్షణం అయినా మరపు ఓర్వలేనంత వ్యాకులత కలగాలి. దేవుణ్ణి మరచిపోతే మనకు శాంతి లేదు అనే ధ్రుడమైన సంకల్పం ఉండాలి. ఈశ్వరానుగ్రహం తప్ప వేరొక వస్తువుతో పనిలేదనే భావన ఉదయిస్తే మనకు తెలియకుండనే భక్తి పుడుతుంది. అదే శరణాగతి తత్వం!

9, జనవరి 2014, గురువారం

వైకుంఠ ఏకదశి విశిష్టత

శ్రీమహావిష్ణువు
 
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. (నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.