14, ఆగస్టు 2014, గురువారం

స్వాతంత్ర్యం

ఎందఱో మహానుభావుల త్యాగ నిరతికి ప్రతిఫలంగా భారతదేశానికైతే స్వాతంత్ర్యం వచ్చింది కానీ భారతీయులకు మాత్రం ఇంకా రాలేదు. అదేంటి... భారతదేశానికి రావడం, భారతీయులకు రాకపోవడం... 'దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్..' అన్నారు కదా గురజాడ గారు... ఏమైంది వీడికి ఇవాళ్ళ అనుకుంటున్నారా? నేను  ప్రస్తావించింది బాహ్య స్వాతంత్ర్యం గురించి కాదు... ఇది ఇంద్రియాల మీద ధిక్కారంతో సాధించుకోవలసిన ఆంతరంగికమైన స్వాతంత్ర్యం.

'స్వాతంత్ర్యం వచ్చినా మనలో ఫ్యూడల్ లక్షణాలు ఇంకా పోలేదు. అవసరమైతే మనకన్నా పైనున్నవాడి పాదాల మీద తలపెట్టడానికి ఎంత సిద్ధంగా ఉంటామో మన కింద ఉన్నవాడి తల మీద పాదం పెట్టడానికి అంతే సిధ్ధంగా ఉంటాం' అన్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు. అసలైన స్వాతంత్ర్యం అంటే మానసికమైన, ఆంతరంగికమైన స్వాతంత్ర్యమే అంటారు వారు.

నిజమే - జడత్వ, మూఢత్వ అంధకారాలను చీల్చుకొని, కులమతాల అడ్డుగోడలను పగలగొట్టి వాటి నుండి విముక్తులు కావడమే నిజమైన స్వాతంత్ర్యం. ఇంద్రియాలను అణచుకోలేక పంచ తన్మాత్రలకు బానిసై ఆ మదించిన గుర్రాలను అణచలేక అవి ఎటువైపు తీసుకెళ్తే అటు వెళ్ళి వాటిని శాంతింపజేసేందుకే జీవితకాలం వెచ్చించి చివరకు భ్రష్ఠుడైపోతాడు మనిషి. ఇది కాదా బానిసత్వం అంటే? ఈ దాస్య శ్రుంఖలాల నుండి విముక్తి పొందడం కాదా స్వాతంత్ర్యం అంటే?

మనసులో సుఖాల ఏ‌సి గదులతో కూడిన కోరికల కాంక్రీట్ భవనాలను నిర్మించే బదులు ఆలోచన అనే నాగలితో దున్ని, మానవత్వపు విత్తును నాటి, సంప్రదాయపు దడ్డి కట్టి, కరుణ నీరు పోసి, భక్తి రశ్మి సోకింపజేస్తే ప్రతి మనసు అందాల బృందావనమే కదా!

అప్పుడు మనం అందరం నిత్యం కోరుకునే సౌభ్రాతృత్వం, సుఖం, శాంతి  అప్రయత్నంగానే నెలకొంటాయి... మన మనసుల్లోనే కాదు, దేశంలో కూడా. ఆ వైపు అందరూ అడుగులు వేయాలని, ఆకాంక్షిస్తూ...

సర్వే జనాః సుజనోభావంతు సర్వే సుజనాః సుఖినోభవంతు ||